బీజేపీ, కాంగ్రెస్‌లు సైతం పెద్దసైజు ప్రాంతీయ పార్టీలే

By అంజి  Published on  13 Feb 2020 9:21 AM GMT
బీజేపీ, కాంగ్రెస్‌లు సైతం పెద్దసైజు ప్రాంతీయ పార్టీలే

ఢిల్లీ: టైమ్స్‌ నౌ ఇండియన్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2020 సమ్మిట్‌లో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర అనే అంశంపై మంత్రి కేటీఆర్‌ చర్చా గోష్టిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలేనని అన్నారు. దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలు ఏవి లేవన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు సైతం పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని.. బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన దేశం సాధ్యమవుతుందన్నారు. కేంద్రప్రభుత్వ విధానాలు ఎన్ని ఉన్నా.. వాటి ఆచరణ అంతా కూడా రాష్ట్రాల్లోనే ఉన్నదని.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల అమలును సైతం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాల్సి ఉంటుందన్నారు. మేకిన్‌ ఇండియా లాంటి కార్యక్రమాల్లోనూ రాష్ట్రాల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణలో కీలకంగా ఉంటుందన్నారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు తన సొంత నిధులు ఇస్తున్నామన్న ఆలోచన మంచిది కాదని మంత్రి కేటీఆర్‌ టౌమ్స్‌ నౌ చర్చా గోష్టిలో చెప్పారు. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తున్న విషయాన్ని మరువకూడదన్నారు. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల 72 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే.. తిరిగి రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షా 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు.

తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు, కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే.. కేంద్రం అన్ని నిధులను రాష్ట్రానికి తిరిగి ఇవ్వలేని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను శత్రువులుగా భావించడం లేదని, కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాటం చేస్తాం.. అలాంటి పార్టీలతో వ్యక్తిగత శత్రుత్వం లేదని అన్నారు. కేవలం తమ వాదన లేదా ఐడీయాలజీకి వ్యతిరేకంగా నిలిచి ఉన్నంత మాత్రాన.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలను, ఇతర పార్టీలను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలను అంశాల వారీగా మద్దతిచ్చిన తాము, ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలను అదేవిధంగా వ్యతిరేకించామన్నారు.

హైదరాబాద్‌ను భారతదేశానికి రెండవ జాతీయ రాధానిగా ప్రకటించాల్సి వస్తే.. హైదరాబాద్‌ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో అనుమానం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కోపరేటివ్‌ ఫెడరలిజం, టీమ్‌ ఇండియా వంటి మాటలు చెప్పే ప్రధానమంత్రి, ఆ భావనల స్ఫూర్తి ఆధారంగా పని చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.

నీతి అయోగ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసిన. ఇప్పటి దాకా మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టు వంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, ఎఫ్‌ఆర్బీఎమ్‌ పరిమితులు వంటి అంశాల్లో మరింత లిబరల్‌గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story