రెచ్చిపోయిన పోలీసులపై సీరియస్‌.. చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీలను కోరిన కేటీఆర్‌

By సుభాష్  Published on  2 April 2020 2:55 PM IST
రెచ్చిపోయిన పోలీసులపై సీరియస్‌.. చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీలను కోరిన కేటీఆర్‌

తెలంగాణలో వనపర్తి ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం ఏదైనా పోలీసులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. ఇలా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా హోంమంత్రి మహమూద్‌ఆలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిలను కోరారు. రోడ్డుపై వచ్చిన ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాదడం బాధాకరమన్నారు. అంతేకాకుండా తండ్రిని పోలీసులు కొడుతుంటే కుమారుడు వద్దని ఎంతగా ప్రాదేయపడుతున్నా.. పోలీసులు వినకుండా చితకబాదడం దారుణమన్నారు.

కాగా, కరోనా వైరస్‌ కారణంగా తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలో నిత్యావసర సరుకుల నిమిత్తం బయటకు వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు తీవ్రంగా చితకబాదారు. వెంట వచ్చిన ఆయన కొడుకు 'అంకుల్ వద్దు అంకుల్..ప్లీజ్ ఆపండి అంకుల్..మా డాడీ అంకుల్..డాడీ..డాడీ' అని ఎంత ఏడ్చినా పోలీసులు మాత్రం ఇంతైన కనికరించలేదు. బయటకు ఎందుకు వచ్చావంటూ కాళ్లతో తన్నుతూ ఆ వ్యక్తిని కిందపడేసి ఖాకీలు పిడిగుద్దులు గుద్దారు. తండ్రిని కొడుతుంటే కొడుకు వద్దని ఏడుస్తూ బతిమిలాడినా ఎంతకి వినిపించుకోలేదు. ప్రతీ ఒక్కరిని కలచివేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది. సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.



Next Story