హైదరాబాద్: హాట్‌స్పాట్ కేంద్రంగా కొండాపూర్ ఆస్పత్రి
By సుభాష్ Published on 27 Jun 2020 8:26 AM ISTతెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక ఇటీవల హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో 10 మంది వైద్య సిబ్బంది, నలుగురు పేషంట్లకు కరోనా సోకింది. దీంతో వారందరిని అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కొండాపూర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా నిర్ధారణ కాగా, ఈ ఆస్పత్రిలో ఇప్పటి వరకూ 15 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని హాట్‌స్పాట్ కేంద్రంగా మార్చేశారు అధికారులు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా పంజా విసురుతుండటంతో ప్రతి రోజు వందలాదిగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నగరంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో 50వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. వచ్చే పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది.
ఇక తాజాగా నిన్న ఒక్క రోజే 985 కేసులు పాజిట్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. ఇలా రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక ప్రతి రోజు హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల పరంపర కొనసాగుతుండటంతో నగరవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ముందుగా నెమ్మదిగా పెరుగుతూ వచ్చిన కేసులు.. ఇటీవల నుంచి పాజిటివ్ కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.