వైసీపీ నేత భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్, టీడీపీ నేతల గృహ నిర్బంధం
By సుభాష్ Published on 4 July 2020 9:46 AM ISTఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ ముఖ్యనేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం జాతీయ రహదారిపై కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ వైపు వెళ్తున్న ఆయనను మఫ్టీలో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు మార్గమధ్యలో వాహనాన్ని ఆపేసి అరెస్ట్ చేశారు. అనంతరం తుని నుంచి విజయవాడకు తరలించారు. అయితే కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్న కొల్లు రవీంద్రను రహస్యంగా విచారిస్తున్నారు. కాగా, కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడంతో ముందస్తుగా పోలీసులు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు.
అలాగే ఈ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే కొల్లు రవీంద్రపై 302,109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక నోటీసులు ఇచ్చేందుకు రవీంద్ర ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగివెళ్లిపోయారు. దీంతో ఆయన ఆచూకీ కోసం మూడు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, విశాఖ వైపు వెళ్తుండగా అరెస్ట్ చేశారు. కాగా, అరెస్ట్ అయిన మరో ఇద్దరి వాగ్మూలాన్ని సైతం పోలీసులు రికార్డు చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే హత్య చేశామని ప్రధాని నిందితులు వాగ్మూలాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, గత నెల 29వ తేదీన చేపల మార్కెట్‌లోకి వెళ్లిన భాస్కర్‌రావును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అయితే కత్తితో దాడి చేసిన వ్యక్తులు.. కత్తికి సైనెడ్ పూయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. భాస్కర్‌రావును నిందితులు కత్తితో బలంగా పొడిచి పరారయ్యారు.
సీసీ పుటేజీ ద్వారా నిందితుల గుర్తింపు
కాగా, దారుణ హత్యకు గురైన భాస్కర్‌రావు.. హత్య జరిగిన ప్రాంతంలోని పోలీసుల సీసీ పుటేజీలనీ పరిశీలించారు. హత్య జరిగిన వెంటనే పోలీసులు కొంత పురోగతి సాధించారు. హత్య కు పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత నిందితులు బైక్‌పై పరారైనట్లు గుర్తించారు. ఈ హత్యలో భాస్కర్‌రావు గుండెకు బలమైన గాయం కావడంతోనే అక్కడికక్కడే మృతి చెందాడు.
మచిలీపట్నంలో వైసీపీ నేత, రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి భాస్కర్‌రావు ముఖ్య అనుచరుడు. భాస్కర్ రావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పని చేశారు.