ఆ విజయానికి 19ఏళ్లు..
By తోట వంశీ కుమార్ Published on 15 March 2020 2:16 PM ISTసరిగ్గా 19 ఏళ్ల క్రితం.. 2001వ సంవత్సరం మార్చి 15 తేదీ. భారత క్రికెట్ చరిత్రను సమూలంగా మార్చిన రోజది. ప్రపంచ నెంబర్ వన్ జట్టు ఆస్ట్రేలియా పై టీమిండియా విజయం సాధించిన రోజు. ఈ విజయం భారత క్రికెట్ గతిని మార్చింది.
ఆస్ట్రేలియా పేరు చెబితేనే గడగడలాడే రోజులవి.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు అంటేనే ఆశలు వదిలేసుకునే కాలమది. ప్రపంచ నెంబర్ వన్ హోదాలో, వరుసగా పదహారు టెస్టు విజయాలతో భారత్ గడ్డపై అడుగుపెట్టింది కంగారూ జట్టు. ఆసీస్ జట్టుతో కనీసం డ్రా చేసుకుంటే చాలు.. విజయం సాధించినట్లే అని అభిమానులు భావించే వారు ఆరోజుల్లో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. క్రికెట్ ప్రపంచంలో ఆసీస్ గుత్తాధిపత్యం ఎలా సాగించేదో..
ఒకే ఒక టెస్టు.. ఒకే ఒక ఇన్నింగ్స్.. ఒకే ఒక భాగస్వామ్యం.. ఆస్ట్రేలియా ఏకచక్రాధిపత్యానికి తెరదించింది. ఆస్ట్రేలియా జట్టును కోలుకోని దెబ్బతీసింది. ఆ టెస్టే 2001 కోల్‌కత్తా టెస్టు. అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసిన టెస్టు అది. భారత మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్మణ్(281) చారిత్రాత్మక ఇన్నింగ్స్‌కు ఆడిన మ్యాచ్ అది.
కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు కెప్టెన్ స్టీవ్‌వా సెంచరీ(110), ఓపెనర్ మాథ్యూ హెడెన్ (97) రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్‌ఇండియా.. ఆసీస్ ఫాస్టు బౌలర్ మెక్‌గ్రాత్(4వికెట్లు) ధాటికి 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది.
274 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమ్‌ఇండియా 232 పరుగులకే సచిన్, గంగూలీ సహా నాలుగు వికెట్లు కోల్పోయింది. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్‌కు దివాల్ రాహుల్ ద్రావిడ్ (180) జత కలిసాడు. ఈ జోడి మెక్‌గ్రాత్, షేన్‌వార్న్ గిలెస్పీ వంటి ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. అంతక ముందు వరకు తమ పేస్, స్నిన్‌తో వణికించిన ఈ బౌలర్లు.. ఈ జోడి ముందు తేలిపోయారు.
మణికట్టు షాట్లతో మైమరిపించే డ్రైవ్‌లతో, మెరుపు కట్‌షాట్లతో స్కోర్ పెంచుతూ పోయిన సొగసరి బ్యాట్స్‌మెన్ భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన గావస్కర్(236) రికార్డును బద్దలు కొట్టాడు. ద్రావిడ్-లక్ష్మణ్ జోడి ఐదో వికెట్‌కు 335 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 657/7 వద్ద తన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. ఆసీస్ ముందు 384 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ హ్యాటీక్‌తో (6/73)తో చెలరేగడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 212 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 171 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ తరువాత ఆసీస్‌ను ఏ జట్టైనా ఓడించగలదు అనే విశ్వాసం అందరిలో వచ్చింది. ఈ మ్యాచ్‌తో ఆసీస్ మానసికంగా కుంగిపోయింది. ఈ విజయం భారత క్రికెట్ గతినే సమూలంగా మార్చివేసింది. ఎంతటి జట్టుపైనైనా విజయం సాధించగలం అనే నమ్మకాన్ని జట్టులో కలిగించింది. ఈ విజయం మిగిలిన జట్లపై ఎంతగా ప్రభావం చూపించిందంటే.. ఫాలోఆన్ ఇవ్వడానికి ఆలోచించేంతగా..
ఆస్ట్రేలియాపై కోల్‌కత్తా టెస్టు గెలిచి నేటితో 19 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆనాటి చారిత్రక ఇన్నింగ్స్ ను గుర్తు చేసుకుంటూ వీవీఎస్ లక్ష్మణ్.. ద్రవిడ్‌తో కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. '19ఏళ్ల క్రితం కోల్‌కత్తాలోని ఈడెన్‌గార్డెన్‌లో జరిగిన టెస్టులో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియాపై భారత్ విజయంలో పాలుపంచుకునే అదృష్టం దక్కింది. అది సమిష్టి గెలుపు. ఆ విజయంలో భాగం కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా' అని లక్ష్మణుడు రాసుకొచ్చాడు.