ఆరోజు రాత్రి ఎంతగా ఏడ్చానో.. విరాట్ కోహ్లీ
By తోట వంశీ కుమార్ Published on 22 April 2020 1:49 PM ISTభారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం క్రికెట్ ఆడే వారిలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. ఫార్మాట్ ఏదైనా పరుగుల ప్రవాహాం మాత్రం ఆగదు. అభిమానులు అంతా.. ముద్దుగా రన్ మిషన్ అని పిలుచుకుంటారు. ఇక చేధనలో అయితే.. విరాట్ చెలరేగి పోతాడు. తన కెరీర్‌లో విరాట్ సాధించిన శతకాలలో అత్యధికంగా చేధనలో సాధించినవే. ఇక ప్రతి టీమ్ కూడా విరాట్ లాంటి బ్యాట్స్ మెన్ తమ టీమ్‌లో కూడా ఉండాలని కోరుకుంటుంది అనడంతో అతి శయోక్తి లేదు. ఇక విరాట్ ఆడతానంటే.. ఏ టీమ్ అయినా వద్దు అని అంటుంటా చెప్పండి..
ప్రస్తుతం విరాట్ కెరీర్ పీక్ స్టేట్‌లో ఉంది. అయితే.. ఒకానొక దశలో స్టేట్ టీమ్‌కి సైతం ఎంపిక కాక ఏడ్చాడట ఈ భారత కెప్టెన్. ఈ విషయాన్ని విరాటే స్వయంగా చెప్పాడు. అన్ అకాడమీ నిర్వహించిన ఆన్‌లైన్ సెషన్‌లో కోహ్లీ. అతడి సతీమణి అనుష్క శర్మ పాల్గొని మాట్లాడారు.
'ఎన్నో కష్టాల్ని, నష్టాల్ని కలిగించిన ఈ మహమ్మారి(కరోనా వైరస్) వల్ల ఒక ప్రయోజనం కూడా ఉంది. మన సమాజం మొత్తానికి దయాగుణాన్ని అలవర్చింది. పరులపట్ల జాలి కలిగేలా చేసింది. కరుణతో స్పందించేలా హృదయాల్ని మేలుకొలిపింది. ప్రాణాలు కాపాడే వైద్యులు, రక్షణ కల్పిస్తున్న పోలీసులు, మనచుట్టూ పరిసరాల్ని శుభ్రం చేస్తున్న కార్మికుల పట్ల కృతజ్ఞతాభావం పెరిగింది. కరోనాతో మనం ఓ పాఠాన్ని నేర్చుకున్నాం కారణం లేకుండా ఏదీ జరగదు. ఇతరుల కంటే.. మనం ప్రత్యేకం కాదని తెలుసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. మనమంతా సమాజమనే భావనతో ఏకమవుతున్నాం. ఇకముందూ ఈ స్పృహ ఇలాగే కొనసాగాలన్నారు.
జీవితంలో నిస్సహాయంగా భావించిన క్షణం గురించి కోహ్లీని అడగ్గా.. కెరీర్ ప్రారంభంలో తొలిసారి స్టేట్ టీమ్ సెలక్షన్స్‌లో పాల్గొన్న నాకు ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్స్‌లో నన్ను ఎంపిక చేయలేదు. దాంతో.. ఆ రోజు రాత్రంతా ఏడ్చాను. కోచ్‌తో ఓ రెండు గంటల పాటు మాట్లాడాను. ఎందుకు సెలెక్ట్ చేయలేదని కూడా అడిగాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఇలా ఎందుకు జరిగిందని తీవ్రంగా ఆలోచిస్తూ బాధపడ్డాను. కానీ ఆటపై నాకు ఉన్న అంకితభావం మళ్లీ ఈ స్థాయిలో నిలబెట్టింది'అని విరాట్ చెప్పుకొచ్చాడు.