జట్టులో ఎంపిక కోసం కోహ్లీని లంచం అడిగారట..!
By తోట వంశీ కుమార్ Published on 19 May 2020 12:13 PM ISTప్రస్తుతం క్రికెట్ ఆడేవారిలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరు అంటే అందరూ చెప్పే ఒకే ఒక్క సమాధానం విరాట్ కోహ్లీ. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగులు వరద పారిస్తున్నాడు విరాట్. చేజింగ్‌లో మొనగాడు. ప్రతి జట్టు విరాట్ లాంటి ఆటగాడు తమ జట్టులో ఉండాలని కోరుకుంటుందంటే అతిశయోక్తి కాదు. అంతలా క్రికెట్ పై తనదైన ముద్ర వేశాడు. చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అయితే.. విరాట్ ను జట్టులోకి ఎంపిక చేయడానికి లంచం అడిగారంట.. ఈ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీనే చెప్పుకొచ్చాడు. అయితే.. అది జాతీయ జట్టులోకి కాదులెండి.. స్టేట్ టీమ్‌లో ఆడేందుకట.
ఆదివారం భారత పుట్‌బాల్ కెప్టెన్ సునీల్‌ఛెత్రీతో లైవ్‌లో మాట్లాడిన కోహ్లీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన తండ్రి ప్రేమ్ కోహ్లీ వీధి దీపాల కింద చదువుకొని, ఎంతో కష్టపడి పై కొచ్చారని తెలిపాడు. లాయర్‌గా పని చేసేవారని, లంచం వంటి పదాలు ఆయనకు నచ్చవని చెప్పుకొచ్చాడు. జీవితంలో ఎదగాలంటే కష్టపడడం ఒక్కడే మార్గమని.. తన తండ్రి నమ్మిన సూత్రం ఇదేనని కోహ్లీ తెలిపాడు.
ఢిల్లీ జట్టులో తన సెలక్షన్ కోసం అధికారులు లంచం అడిగితే.. మానాన్న తిరస్కరించాడని దీంతో జట్టులో తనకు చోటు దక్కలేదన్నాడు. స్టేట్ క్రికెట్ లో ఎంపిక చేయడానికి ఓ అధికారి లంచం అడగడంతో మా నాన్న ఒకే మాట చెప్పారు. మీరు విరాట్‌ని సెలక్ట్ చేయాలంటే.. అతని మెరిట్ ప్రకారం చేయండి, అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తేల్చి చెప్పారు. ఆ తర్వాత తన పేరు సెలెక్షన్‌లో చోటు చేసుకోలేదని, అప్పుడు చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఆ ఘటన తనకో పాఠం నేర్పిందని చెప్పాడు. ప్రపంచం అంటే ఇలానే ఉంటుందనే విషయం తెలిసిందని, మనం పైకి ఎదగాలంటే ఎవరూ చేయలేని పని చేయాలి. జీవితంలో ఎదగాలంటే కష్టపడడం ఒక్కటే మా నాన్న నేర్పిన పాఠం. తన చేతలతోనే నన్ను సరైన మార్గంలో నడిపించారని కోహ్లీ అన్నాడు.
కోహ్లీ 18ఏళ్ల వయసులో తండ్రి మరణించారు. అప్పుడు కోహ్లీ ఢిల్లీ తరుపున కర్ణాటక జట్టుతో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. జట్టు కష్టాల్లో ఉండడంతో.. ఆరోజు సాయంత్రం వరకు బ్యాటింగ్ చేసి జట్టును ఓటమి నుంచి తప్పించాడు.
2008 అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లీ ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్‌లో కలిపి 70 శతకాలు బాదాడు. సచిన్ శత శతకాల రికార్డును కోహ్లీ మాత్రమే బద్దలు కొట్టగలడని పలువురు మాజీలు విశ్వసిస్తున్నారు.