ఆ విషయంలో మాత్రం కోహ్లీ, కుంబ్లే ఒక్కటయ్యారు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 9:57 AM GMT
ఆ విషయంలో మాత్రం కోహ్లీ, కుంబ్లే ఒక్కటయ్యారు..

న్యూఢిల్లీ: టెస్టు మ్యాచ్‌ల కోసం భారత్‌లో ఐదు శాశ్వత వేదికలను ఎంపిక చేస్తే సరిపోతుందన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్యలతో మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే ఏకీభవించాడు. టెస్టు క్రికెట్‌ మరింత అభివృద్ధి చెందాలంటే వేదికల్ని సాధ్యమైనంతంగా తగ్గించడమే ఉత్తమమని కుంబ్లే అభిప్రాయడ్డాడు. ఇదొక మంచి ప్రణాళిక అని కుంబ్లే పేర్కొన్నాడు. వేదికలను తగ్గించడమే కాకుండా మ్యాచ్‌ నిర్వహణ సమయం కూడా ముఖ్యమే. పొంగల్‌ సమయంలో చెన్నైలో మ్యాచ్‌లు నిర్వహిస్తాం. సీజన్‌ మొదలైనప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో టెస్టులు నిర్వహిస్తే మేలు.

ఆయా సీజన్‌ను బట్టి ఎక్కడెక్కడ మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుంటుందో ఆలోచిస్తే.. మంచి మార్కెట్‌ కూడా అవుతుంది. ప్రేక్షకులు కూడా మ్యాచ్‌లు చూసేందుకు వస్తారు. నేను కోచ్‌గా ఉన్నప్పుడు ఆరు వేర్వేరు వేదికల్లో మ్యాచ్‌లు జరిగాయి. అన్నీ కొత్తవే. ఇండోర్‌లో మాత్రమే అభిమానులు ఎక్కువగా వచ్చారు. నగరం నడిబొడ్డున మైదానం ఉంది. అందుకే సమయంతో సంబంధం లేకుండా మ్యాచ్‌లు చూడటానికి అభిమానులు వచ్చారని కుంబ్లే తెలిపారు. దాంతోపాటు మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే అభిమానులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. సీట్లు సౌకర్యం బాగుండటంతో పాటు ప్రయాణ సాధనలు కూడా బాగుండాలన్నారు. టికెట్లు ఇచ్చేందుకు టెక్నాలజీని మరింత ఉపయోగించడంతో పాటు నీరు, మరుగదొడ్డ వసతులు కూడా మెరుగ్గా ఉండాలని కుంబ్లే పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టును వీక్షించేందుకు అభిమానులు లేక రాంచీ స్టేడియం బోసిపోయింది. 39 వేల సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో తొలి రోజు ఆట కోసం అమ్మింది కేవలం 1500 టిక్కెట్లు మాత్రమే. అందుకే మరోసారి ఇక్కడ టెస్టు మ్యాచ్‌ నిర్వహణపై జార్ఖండ్‌ క్రికెట్‌ సంఘం పునరాలోచనలో పడింది. ఇప్పుడు ఇదే విషయమై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా స్పందించాడు. మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నకు కోహ్లి సమాధానమిస్తూ.. అన్నింటిని టెస్టు వేదికలుగా పరిగణించాల్సిన పనిలేదన్నాడు. టెస్టు మ్యాచ్‌లు జరగానికి ఐదు శాశ్వత వేదికలు ఉంటే చాలన్నాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాల్లో ఇలాగే జరుగుతుందని గుర్తు చేశాడు

Next Story