దివికేగిన దిగ్గ‌జం.. విషాదంలో క్రీడా ప్ర‌పంచం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Jan 2020 12:58 PM GMT
దివికేగిన దిగ్గ‌జం.. విషాదంలో క్రీడా ప్ర‌పంచం

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దిగ్గ‌జ‌ బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్ మృతిచెందారు. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బ్రయంట్‌తో పాటు అత‌ని కూతురు జియా కూడా ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించింది. వీరి మృత‌దేహాల‌ను అధికారులు గుర్తించగా.. విమాన‌ పైలట్, మరో ఆరుగురు ప్రయాణీకుల గుర్తింపు అధికారుల‌కు స‌వాల్‌గా మారింది.

 కోబ్ బ్రయంట్ బాస్కెట్ బాల్ క్రీడలో ఎంతో పేరు సంపాదించారు. ఈయనకు 41 సంవత్సరాలు.

1978 ఆగస్టు 23వ తేదీన యూఎస్‌లో జన్మించిన కోబ్ బ్రయంట్.. పాఠశాల విద్య ముగియగానే ఎన్‌బీఏలో చేరాడు. దీంతో అతి చిన్న వయస్సులోనే లీగ్ దశల్లో ఆడిన ఆట‌గాడిగా గుర్తింపు పొందాడు. 41 ఏళ్ల బ్ర‌యంట్.. త‌న‌ 20 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో రికార్డులు సాధించారు.

ఎన్‌బీఏ తరపున ఆడిన బ్ర‌యంట్ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచారు. అలాగే 2012 ఒలింపిక్స్‌లో అమెరికా టీమ్ తరపున ఆడిన కోబ్.. రెండు స్వర్ణపతకాలు గెలుచుకున్నాడు. 2016లో ఎన్‌బీఏ నుండి ఆల్ టైమ్ స్కోరర్‌గా రిటైర్ అయ్యారు. అత్య‌ధికంగా బ్ర‌యంట్ 18 సార్లు ఆల్ టైమ్ స్టార్‌గా నిలిచారు. అలా ఎన్‌బీఏ చరిత్రలో గొప్ప ఆటగాడిగా పేరు సంపాదించాడు.

ఓ బాస్కెట్ బాల్ ఆట‌గాడిగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో బ్రయంట్‌ది మొద‌టిస్థానం. బ్ర‌యంట్ 24, 8 నెంబర్ గల జెర్సీని ధరించి బ‌రిలో దిగేవాడు. బ్రయంట్ హ‌ఠాత్తు మ‌ర‌ణ‌ వార్త విన్న‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బ్ర‌యంట్ మృతి ప‌ట్ల నివాళులు వెల్లువెత్తుతున్నాయి.



బీసీసీఐ.. బ్రయంట్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆశిస్తూ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ పోస్టు చేసింది. అలాగే.. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూడా బ్ర‌యంట్ మృతి ప‌ట్ల‌ త‌న ట్విట్ట‌ర్ ద్వారా నివాళి అర్పించారు. కోబ్ బ్ర‌యంట్ మృతి విషాదాన్ని మిగిల్చింద‌న్నారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు సంతాపం తెలుపుతున్న‌ట్లు స‌చిన్ పేర్కొన్నారు. మ‌రో మాజీ క్రికెట‌ర్ సెహ్వాగ్ కూడా కోబ్ మృతి ప‌ట్ల నివాళి తెలిపారు. కోబ్ వ‌ల్లే చాలా మంది ఎన్‌బీఏ ఫ్యాన్స్ అయ్యార‌ని సెహ్వాగ్ అన్నారు.



ఇదిలావుంటే.. బాస్కెట్‌బాల్ దిగ్గ‌జం కోబ్‌ బ్రయంట్‌ మరణవార్త తెలిసి తాను షాక్‌కు గురయినట్టు టీఆర్‌ఎస్‌పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా దిగ్ర్భాంతిని వ్యక్తంచేశారు. ఈ మేరకు కేటీఆర్‌ కోబ్‌ మృతికి సంతాపం తెలిపారు. కోబ్‌ తనకు ఇష్టమైన ఆటగాడని. ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన కుమార్తె కూడా మ‌ర‌ణించ‌డం తనను కలిచి వేసిందని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.



Next Story