కమిన్స్‌.. కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా ఆడితే ఎలా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sept 2020 11:28 AM IST
కమిన్స్‌.. కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా ఆడితే ఎలా

సమఉజ్జీల పోరుగా అనుకున్న మ్యాచ్‌ ఏకపక్షమైంది. చెన్నై చేతిలో ఓటమి తరువాత ఎంతో కసిగా ఆడిన ముంబై ఇండియన్స్‌.. కోల్‌కత్తాను 49 పరుగుల తేడాతో ఓడించింది. మొదట కెప్టెన్ రోహిత్‌ శర్మ(80; 54బంతుల్లో 3పోర్లు, 6 సిక్సర్లు) తో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌(47; 28బంతుల్లో 6పోర్లు, 1సిక్సర్‌) సత్తా చాటడంతో ముంబయి 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కత్తా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేదించేలా కనిపించలేదు. బుమ్రా(2/32), బౌల్డ్‌(2/30), ప్యాటిన్సన్‌(2/25), రాహుల్‌ చాహర్‌(2/26) రాణించడంతో.. కోల్‌కత్తా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ పూర్తిగా విఫలమైన వేళ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొత్తం కోటా పూర్తి చేయకుండానే కేవలం 3 ఓవర్లే వేసిన కమిన్స్‌ 16 ఎకానమీ రేటుతో 49 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా అతని ఖాతాలో పడలేదు. అతని బౌలింగ్ ఆద్యంతమూ నాసిరకంగా కనిపించింది. లైన్ అండ్ లెంగ్త్ తప్పిపోయాడు. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. తప్పుల మీద తప్పులు చేశాడు. ఓ సాధారణ బౌలర్‌లా మారిపోయాడు. బంతి ఎక్కడ? ఎలా వేయాలనే విషయాన్ని కూడా మర్చిపోయినట్లుగా సాగింది అతని బౌలింగ్. 'కమిన్స్‌.. కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా ఆడితే ఎలా' అంటూ అతనిపై సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వస్తున్నాయి. 2019 డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఈ ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ను రూ.15కోట్లకు కోల్‌కత్తా దక్కించుకున్న సంగతి తెలిసిందే.

కాగా.. కేకేఆర్‌ కెప్టెన్‌ దినేష్‌ కార్తిక్‌ మాత్రం పాట్‌ కమిన్స్‌ను వెనుకేసుకొచ్చాడు. 'పాట్‌ కమిన్స్‌ ఒక్క మ్యాచ్‌తోనే తప్పుబట్టడం సరికాదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగిసిన తర్వాత కాస్త ఆలస్యంగా దుబాయ్‌ చేరుకున్న కమిన్స్‌ మ్యాచ్‌ ముందు వరకు క్వారంటైన్‌లోనే ఉండాల్సి వచ్చింది. అసలు ముంబైతో జరగనున్న మ్యాచ్‌కు బరిలోకి దిగుతాడా లేడా అనేది చివరివరకు అనుమానుంగా ఉంది. కానీ అనూహ్యంగా మ్యాచ్‌ ప్రారంభానికి సరిగ్గా రెండు గంటల ముందు అంటే 3.30 లేదా 4 గంటల ప్రాంతంలో క​మిన్స్‌ ఆడేందుకు అనుమతి లభించింది. క్వారంటైన్‌లో ఉన్న కమిన్స్‌ ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండానే బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ముంబైతో మ్యాచ్‌లో అతని బౌలింగ్‌ లయ తప్పింది. ఇలా ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా ఈ విధంగా తప్పు బట్టడం కరెక్ట్‌ కాదు.. కమిన్స్‌ మీద రూ. 15 కోట్లు పెట్టామంటే అతని మీద మాకున్న నమ్మకమేంటో మీకు అర్థమవ్వాలి. ప్రస్తుతం కమిన్స్‌ టెస్టుల్లో నెంబర్‌ వన్‌ బౌలర్‌.. అంతేగాక అతనొక చాంపియన్‌. రానున్న మ్యాచ్‌ల్లో తన లయను అందుకొని ఒక మంచి ప్రదర్శన ఇస్తాడని ఎదురుచూస్తున్నా' అంటూ తెలిపాడు.

Next Story