ఐపీఎల్-13వ సీజన్ రెండు నగరాల్లోనే..?
By తోట వంశీ కుమార్ Published on 16 May 2020 7:14 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్.. కరోనా కారణంగా తొలుత ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అనంతరం లాక్‌డౌన్ పొడిగింపుతో నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఇప్పట్లో ఐపీఎల్ జరిగేలా కనిపించడం లేదు. ఇంతకు ముందులా కాకుండా కేవలం రెండు, మూడు రాష్ట్రాల్లో మ్యాచులను నిర్వహిస్తే సరిపోతుందని పలువురు మాజీలు సూచిస్తున్న సంగతి తెలిసందే. అయితే.. కరోనా నేపథ్యంలో అభిమానులను మ్యాచులకు అనుమనించపోవడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు.
మంచి లాభాలను ఆర్జించే ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఒకటి. ఐపీఎల్‌లో ఆ జట్టు ఆటతీరు ఎలాగున్నప్పటికి అభిమానుల్లో ఆ జట్టుకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. తమ జట్టును బ్రాండింగ్ చేసుకోవడంలో ఆ ఫ్రాంచైజీకి తెలిసినంతగా మరే ఫ్రాంచైజీకి తెలియదంటే అతిశయోక్తి లేదు. ఇక తాజాగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్రాంఛైజీ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 13వ సీజన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
ముందు ముందు టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోందని, అభిమానులు లేకుండా మ్యాచులను ఊహించలేమన్నాడు. తమ జట్టుకు ప్రేక్షకులే 12వ ఆటగాడిగా బావిస్తామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించకపోవచ్చునని, 'ఒక్క సారి మీ ఆలోచనలోంచి బయటకు వచ్చి చూడడండి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ద్వారా అభిమానులు గ్రౌండ్‌కు రాకున్నా సరే గ్రౌండ్‌లో ఉన్న ఎల్ఈడీల ద్వారా ప్రేక్షకులు మైదానంలో ఉన్న ఫీలింగ్‌ను తీసుకురాచ్చునని, అభిమానులు సోషల్ మీడియాలో లైవ్‌గా మ్యాచులు చూస్తున్నా సరే.. మైదానంలో ఉన్నామనే భావన కలిగించవచ్చునని' తెలిపారు.
ఐపీఎల్ మ్యాచ్ లను కేవలం రెండు, మూడు వేదికల్లో నిర్వహిస్తే.. క్రికెటర్లు, సహాయ సిబ్బంది, మ్యాచ్ అధికారులు కరోనా వైరస్ ప్రభావానికి గురయ్యే అవకాశాలు చాలా తగ్గుతాయన్నారు. 2014లో యూఏఈలో ఐపీఎల్ ను మూడు వేదికల్లోనే నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశాడు. ప్రస్తుతం 13వ సీజన్ ను సైతం ముంబై, పూణే వేదికల్లో నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ముంబైలో నాలుగు స్టేడియాలు ఉండగా.. పూణేలో ఒక స్టేడియం ఉంది. మొత్తం 5 స్టేడియాలను ఉపయోగించకోవచ్చునని పేర్కొన్నాడు. ముంబై, పుణె మధ్య మూడు గంటల ప్రయాణం మాత్రమే కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండవని వెంకీ మైసూర్ తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన కోల్‌కత్తా నైట్ రైడర్స్ సూచించిన ఈ విధానం పై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ప్రతి జట్టు 14 మ్యాచులు ఆడుతుండగా.. సొంత మైదానంలో 7 మ్యాచులు, ప్రత్యర్థుల మైదానంలో 7 మ్యాచులు ఆడతున్న సంగతి తెలిసిందే.