హైదరాబాద్‌: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఫైర్‌ అయ్యారు. కేంద్రమంత్రికి ప్రోటోకాల్‌ విషయంలో ఎక్కడా లోటు లేదన్నారు. మెట్రో ప్రారంభం ముందు రోజే స్వయంగా తానే కిషన్‌రెడ్డిని ఆహ్వానించానని తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నాయని.. రాకపోవచ్చని అని చెప్పారని మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. మన సిటీ ప్రాజెక్టు, తమరు తప్పక రావాలని విజ్ఞప్తి చేశానన్నారు. మెట్రో ప్రారంభాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ పండుగల చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. మెట్రోకి అన్ని అనుమతులు వచ్చిన వెంటనే ప్రారంభం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మంత్రులు లేనిది చూసుకొని.. పిలవకుండా ఉండాలనే ఉద్దేశ్యం తమకు లేదని మంత్రి శ్రీనివాస్‌ అన్నారు.

ప్రోటోకాల్‌ పాటించకపోవడం లాంటి చిల్లర పనులు తాము చేయమన్నారు. కేంద్రమంత్రికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్‌ ఎప్పుడూ ఇస్తూనే ఉన్నామన్నారు. మెట్రో తొలి ప్రారంభం ప్రధాని చేతుల మీదుగానే జరిగిందని మంత్రి తలసాని గుర్తు చేవారు. మెట్రో అధికారుల మీద నిందలు వేయడం సరికాదన్నారు. ప్రధాని ఫొటోలు పెట్టలేదని నిందలు వేస్తున్నారని, నగరంలో పెట్టిన ప్రతి హోర్డింగ్‌లో ప్రధాని మోదీ ఫొటో వేశామన్నారు. మోదీ, సీఎం కేసీఆర్‌ ఫొటోలతోనే ప్రచారం కల్పించామని మంత్రి తలసాని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అతిగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యనించారు.

మెట్రో అధికారులతో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సమీక్ష

ఇవాళ దిల్‌ కుషా గెస్ట్‌ హౌస్‌లో మెట్రో అధికారులతో కిషన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎల్‌ అండ్‌ టీ ఎండీ కేవీబీ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎంపీ నాయుడు, ఎల్‌టీఎంఆర్‌హెల్‌ఎల్‌ ఏకే షైనీ, హెచ్‌ఎంఎల్‌ఆర్‌ చీఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఆనంద్‌ మోహన్‌, జీఎం రాజేశ్వర్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారుల పనితీరును ఆయన తప్పుబట్టారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న తాము మెట్రో ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని.. కానీ దేశ ప్రధాని నరేంద్రమోదీ ఫొటో మాత్రం ఉండదని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. తన నియోజకవర్గ పరిధిలో జరిగిన మెట్రో కారిడార్‌ ప్రారంభోత్సవానికి, ప్రోటోకాల్‌ ప్రకారం స్థానిక ఎంపీ అయిన తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. తనకు విప్‌ ఉందని, ఆ రోజు అందరం పార్లమెంట్‌లో ఉండాలని కిషన్‌రెడ్డి అన్నారు. కార్యక్రమానికి ఒక్కరోజు ముందు ఎలా చెప్తారంటూ నిలదీశారు.

రూ.1250 కోట్లు మెట్రోకి ఇచ్చామన్నారు… మరో రూ.200 కోట్లు ఇవ్వాలని గుర్తు చేశారు. మెట్రో కారిడార్‌ ప్రారంభోత్సం కూడా టీఆర్‌ఎస్‌ ఫంక్షన్‌ లాగే చేస్తారంటూ అంటూ కిషన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. మెట్రో ప్రారంభోత్స సమయంలో చాలా చోట్ల హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడా కూడా పీఎం మోదీ ఫొటో లేకపోవడంపై ఆయన సీరియస్‌ అయ్యినట్లు తెలుస్తోంది. నిధుల విషయమై కేంద్రం దగ్గరకు రావద్దని.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.