విండీస్ విధ్వంస‌కర‌ ఆట‌గాడు, కెప్టెన్ కీరన్‌ పొలార్డ్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన మొద‌టి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక‌లోని పల్లెకెల వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో పొలార్డ్ ఈ ఫీట్ సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌ల్లో కలిపి పొలార్డ్‌.. 500 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

కాగా, టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో 500 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా కీరన్‌ పొలార్డ్ మొద‌టిస్థానంలో ఉండ‌గా.. రెండో స్థానంలో విండీస్ జ‌ట్టుకే చెందిన‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో ఉన్నాడు. బ్రావో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌ల్లో క‌లిపి 453 మ్యాచ్‌లు ఆడాడు. ఇక‌ యూనివర్సల్ బాస్.. క్రిస్ గేల్ 404 టీ20 మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.

ఇక‌ పొలార్డ్‌ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు తరపున‌ ఆడుతున్నాడు. ఇప్పటివరకు ముంబయి తరపున 170 మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వ‌హించాడు. త‌న‌దైన రోజున బ్యాట్‌తో, బాల్‌తో విజృంభించే పోలార్డ్‌.. ముంబయి నాలుగు ఐపీఎల్ టైటిల్స్, రెండు ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్‌ గెలవడంతో కృషి చేసాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.