కీరన్‌ పొలార్డ్‌ విధ్వంసం.. ఆశలు లేని స్థితిలోంచి గెలిచిన నైట్ రైడర్స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2020 4:23 PM IST
కీరన్‌ పొలార్డ్‌ విధ్వంసం.. ఆశలు లేని స్థితిలోంచి గెలిచిన నైట్ రైడర్స్

వెస్టిండీస్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ ఎంతటి విధ్వంసక ఆటగాడో అందరికీ తెలిసిందే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ తరుపున ఎన్నో ధనాధన్‌ ఇన్సింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాలను అందించిన సంగతి తెలిసిందే. తాజాగా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌) 2020 సీజన్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ తరుపున ఆడుతున్న పొలార్డ్‌.. విజయం అసాధ్యం అనుకున్న మ్యాచ్‌లో విధ్వంస ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ రెండు వికెట్ల తేడాతో గెలిచింది.

శనివారం డిఫెండింగ్ చాంపియన్స్ బార్బోడస్ ట్రిడెంట్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బార్బోడస్ ట్రిడెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 రన్స్ చేసింది. జాన్సన్ చార్లెస్(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47), కైల్ మేయర్స్(37 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్‌తో 42) రాణించారు. అకీల్ హోసీన్, జయ్‌దెన్ సీల్స్, సికిందర్ రాజా రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం 149 పరుగుల సాధారణ లక్ష్యచేధనకు దిగిన నైట్‌రైడర్స్ జట్టు తడబడింది. 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ లెండీ సిమ్మన్స్(29 బంతుల్లో 3 సిక్సర్లతో 32) ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాట్స్‌మెన్స్‌ అంతా విఫలమయ్యారు. ఈదశలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ కీరన్‌ పోలార్డ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కేవలం 28 బంతుల్లో 9 సిక్సర్లు, 2 ఫోర్లు బాది 72 పరుగులు పరుగులు చేశాడు. దాదాపు ఓటమి ఖాయమనుకున్న స్థితిలో పోలార్డ్‌ చెలరేగి ఆడడంతో మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా మారింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 16 పరుగులు అవసరం.

క్రీజులో పొలార్డ్‌ ఉండడంతో ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు లేవు. అనుకున్నట్లుగానే మొదటి బంతిని పొలార్డ్‌ సిక్సర్‌ బాదాడు. అయితే.. రెండో బంతికి పొలార్డ్‌ రనౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సీల్స్ సింగిల్ తీసి పిర్రేకు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతికి భారీ సిక్సర్ బాధిన పిర్రే.. అనంతరం సింగిల్ తీసి ఓ బంతి మిగిలుండగానే విజయాన్నందించాడు. 19.5 ఓవర్లలో నైట్ రైడర్స్ 8 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. నైట్‌రైడర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన పొలార్డ్‌కు మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. దీంతో లీగ్‌లో ఓటమి ఎరుగని జట్టుగా నైట్‌రైడర్స్ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ గెలిచి టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది.

Next Story