అక్కడ కిలో చికెన్ రూ.10 లకే

By రాణి  Published on  13 March 2020 9:24 AM GMT
అక్కడ కిలో చికెన్ రూ.10 లకే

ముఖ్యాంశాలు

  • డీలా పడుతున్న చికెన్ వ్యాపారులు
  • కోళ్ల మేతకు అయ్యే ఖర్చు కూడా రావట్లేదంటున్న డీలర్లు
  • మటన్ గురించీ దుష్ర్పచారం

కరోనా..ఈ మహమ్మారి సోకినవారందరూ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఇది ప్రత్యక్షంగా స్పర్శ ద్వారానే ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని..ప్రజలు జాగ్రత్త వహించాలని, ఆయా దేశాల ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కూడా ఇప్పటికే కరోనా హెల్ప్ లైన్ డెస్క్ లను ఏర్పాటు చేశాయి. కాగా..ఇప్పుడు కరోనా వైరస్ పరోక్షంగా చికెన్ వ్యాపారులన దెబ్బతీస్తోంది. మొన్నీమధ్య గోదావరి జిల్లాలో, ఇటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో VVND (very virulent newcastle disease) వైరస్ వచ్చి లక్షల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. అంతే..ఇక అప్పటి నుంచి చికెన్ తింటే..కరోనా వైరస్ వస్తోందని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇది నిజమేనని నమ్మేసిన జనాలు..అసలు చికెన్ ను ముట్టట్లేదంటే నమ్మండి. దీని కారణంగా చికెన్ వ్యాపారం దెబ్బతింది. చికెన్ వ్యాపారులు ఎన్నడూ చూడని నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read : కరోనా దెబ్బతో కోళ్ల పరిశ్రమ కుదేలు

ఏదో రకంగా కస్టమర్లను ఆకర్షించేందుకు కిలో చికెన్ రూ.30 లేదా రూ.40 లకే ఇస్తామంటూ..చికెన్ వ్యాపారులు బోర్డులు తగిలించడంతో..కొందరూ చికెన్ కోసం ఎగబడ్డారు కూడా. ఒక్క చికెన్ ఏంటి..కరోనా వైరస్ ప్రభావం కోడిగుడ్లు, మటన్ మీద కూడా పడింది. ఇప్పుడు కృష్ణాజిల్లాలో ఇద్దరు కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో చేరారన్న వార్తలు రావడం..చికెన్ వ్యాపారంపైనే ఎక్కువ ప్రభావం చూపుతుంది. వారు ఇతర దేశాల నుంచి వచ్చి..కరోనా లక్షణాలతో ఉన్నారే తప్ప..చికెన్ తినడం వల్లే వారికి కరోనా లక్షణాలున్నాయని ఇంతవరకూ ఏ డాక్టరూ చెప్పలేదు.

Also Read : కృష్ణాజిల్లాలో రెండు కరోనా అనుమానిత కేసులు

మటన్ తిన్నా కరోనా వైరస్ రావడం ఖాయమని కూడా కొంత ప్రచారం జరిగింది. దీంతో నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్ లు తినాలా వద్దా అన్న సందేహంలో పడ్డారు. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ రూ.70 కి అమ్మగా..మరికొన్ని ప్రాంతాల్లో నాలుగు కేజీలు రూ.100కే అమ్మిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కరోనా సోకి ఓ వ్యక్తి మృతి చెందడంతో..ఏపీలో కిలో చికెన్ ధర రూ.10కి పడిపోయింది. కరోనా రాకముందు రూ.200 వరకూ పలికిన చికెన్ ధర రూ.10కి కాదు కదా..ఫ్రీ గా ఇస్తామన్న ఎవరూ తీసుకునేటట్లు కూడా కనిపించడం లేదు. ఎటొచ్చి ఈ ఆఫర్ ఒక్క రెస్టారెంట్లకు మాత్రం ఉపయోగపడుతుందేమో. అక్కడ కూడా చికెన్, మటన్ బిర్యానీలు తినేవారు తక్కువయ్యారు. ఇకపోతే పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు చేసుకునే వారికి ఇది ''భలే మంచి చౌక బేరమే''నండోయ్.

చికెన్ వల్ల కరోనా వస్తుందా ?

నిజానికి చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ రాదని హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఇటీవలే మంత్రులు కేటీఆర్, తలసాని, హీరోయిన్ రష్మికలు స్వయంగా చికెన్ తిని చూపించారు. ఆ చికెన్ తింటే వాళ్లకే కరోనా వైరస్ వస్తుందనుకున్నారేమో జనాలు..మంత్రులు చెప్పినా..చికెన్ మాత్రం తినడం లేదు. పైగా 6 వేల కిలోల చికెన్, ఎగ్ మేళా నిర్వహించి మరీ చెప్పారు. కానీ ఏం లాభం..కరోనా పుణ్యమా అని..చికెన్ వ్యాపారులు డీలా పడాల్సి వస్తోంది. మరో వైపు కోళ్ల ఫారాలు కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. కోళ్ల మేతకు రూ.70 ఖర్చు పెట్టాల్సి వస్తోంది..కనీసం కిలో చికెన్ రూ.50 అయినా రావట్లేదని వాపోతున్నారు. సికింద్రాబాద్ తరహా ప్రాంతాల్లో అయితే కిలో చికెన్ ను రూ.20-30 వరకూ విక్రయిస్తున్నారు. ఏదేమైనా చికెన్ తింటే కరోనా వైరస్ రాదన్నది వాస్తవమే అయినప్పటికీ..సోషల్ మీడియా ప్రభావంతో జనాలు చికెన్ తినడం మానేశారు. కోళ్లకు వచ్చిన VVND వైరస్ వల్ల అవి చనిపోతున్నాయే తప్ప..కరోనా వైరస్ వల్ల మాత్రం కాదు.

Also Read : యాభై ఏళ్ల తర్వాత గాళ్ ఫ్రెండ్ ను కలిసిన అమితాబ్..

Next Story
Share it