ఈ ఎన్నికలతోనే జగన్‌ పతనం ప్రారంభం..

By అంజి
Published on : 10 March 2020 4:21 PM IST

ఈ ఎన్నికలతోనే జగన్‌ పతనం ప్రారంభం..

విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికలతోనే సీఎం వైఎస్‌ జగన్‌ పతనం ప్రారంభమవుతుందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 75 శాతం సీట్లు గెలవబోతున్నామన్నారు. వైఎస్‌ జగన్‌ తన స్వార్థం కోసం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు నాశనం అవ్వాలని సీఎం జగన్‌ ఎందుకు కోరుకుంటున్నాడో అర్థం కావడం లేదని కేశినేని అన్నారు.

సీపీఐ, టీడీపీ కలిసి పని చేస్తుందని, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్‌, విజయవాడ కార్పొరేషన్‌ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసులకు భయపడి సీఎం జగన్‌ భారతీయ జనతా పార్టీకి అమ్ముడు పోయాడని విమర్శించారు. 22 మంది ఎంపీలతో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)కు అనకూలంగా ఓటు వేయించాడన్నారు. కేంద్ర మెడలు వంచుతా అని.. కేంద్ర ప్రభుత్వం కాళ్లు పట్టుకున్నాడని కేశినేని నాని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని పూర్తిగా బీజేపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరు సీఎం జగన్‌కు బుద్ది చెప్పే సమయం వచ్చిందన్నారు.

స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్‌లను టీడీపీ గెలుస్తుందన్నారు. నిజంగా ప్రజలు మీ పక్షాన ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలని సీఎం వైఎస్‌ జగన్‌కు కేశినేని నాని సవాల్‌ విసిరారు. ఓటమి భయంతోనే టీడీపీ అభ్యర్థులపై కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి ఎన్నికలను గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే మంత్రుల పదవులు పోతాయని బెదిరించిన సీఎం దేశంలో మరెవరూ లేరంటూ విమర్శించారు. పులివెందుల సంస్కృతి రాష్ట్రంలోకి తెస్తున్నారని కేశినేని నాని ఆరోపించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో కావాలనే ఎన్నికలు ఆపేశారని మండిపడ్డారు.

Next Story