లాక్‌డౌన్ ఉల్లంఘన: 1258 మంది అరెస్ట్.. 8,311 కేసులు
By సుభాష్ Published on 29 March 2020 12:16 PM IST
ప్రపంప వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా మహమ్మారికి ప్రపంచ వ్యాప్తంగా 30వేలకుపైగా మరణించగా, లక్షల్లో చికిత్స పొందుతున్నారు. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది. ఇక 21 మంది మృతి చెందారు. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 65కు చేరగా, నిన్న తొలి కరోనా మరణం నమోదైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించవద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా జనాలు రోడ్లపైకి రావడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. కొన్ని రోజులు నిబంధనలు ఉల్లంఘించవద్దని పోలీసులు నచ్చజెప్పినా ఏ మాత్రం వినకపోవడంతో నిబంధనలు మరింత కఠినతరం చేశారు పోలీసులు. హైదరాబాద్‌లో కూడా కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పలు కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇక కేరళలో మాత్రం కేసులు బాగానే నమోదవుతున్నాయి.
దీంతో కేరళ పోలీసులు కూడా కొరఢా ఝులిపిస్తున్నారు. నియమ నిబంధనలు పాటించని 1258 మందిని అరెస్ట్ చేశారు. 792 వాహనాలు సీజ్ చేశారు. ఇక ఐదు రోజుల లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు పాటించకుండా ఉల్లంఘించిన కేసులు మొత్తం 8వేల 311 నమోదైనట్లు కేరళ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కేరళ వ్యాప్తంగా పోలీసులు ఎవరూ కూడా బయటకు రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఏది ఏమైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం తాట తీస్తున్నారు కేరళ పోలీసులు.