'కీర్తి' ప్రతిష్టలు పోగొడుతున్న సినిమాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Jun 2020 2:34 AM GMT
కీర్తి ప్రతిష్టలు పోగొడుతున్న సినిమాలు

‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్‌కు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ముందు ఆ సినిమాకు ఆమెను కథానాయికగా ఎంచుకున్నపుడు ఏమాత్రం ఆ పాత్రను పండించగలదని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ కీర్తి అత్యద్భుత నటనతో సావిత్రి పాత్రలో జీవించి ఆమెను వ్యతిరేకించిన వాళ్లతో కూడా శభాష్ అనిపించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా అద్భుత ఫలితాన్నందుకుని కీర్తి ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. ఈ నటనకు జాతీయ అవార్డు కూడా కీర్తిని వరించడంతో ఆమె స్టేచరే మారిపోయింది.

ఈ క్రమంలోనే కీర్తి ప్రదాన పాత్రలో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పట్టాలెక్కాయి. అవి వేటికవే భిన్నంగానూ కనిపించాయి. కీర్తి ప్రధాన పాత్రలో నటించిన మూడు సినిమాల్లో చాలా ప్రత్యేకంగా కనిపించింది ‘పెంగ్విన్’యే. కార్తీక్ సుబ్బరాజ్ లాంటి విలక్షణ దర్శకుడు ఈ సినిమాను సమర్పించడం.. ప్రోమోలన్నీ కూడా ఆసక్తికరంగా అనిపించడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి ఓటీటీలో రిలీజైనప్పటికీ ‘పెంగ్విన్’కు మంచి హైప్ కనిపించింది. కానీ దీనిపై ఉన్న అంచనాలన్నీ సినిమా రిలీజైన కొన్ని గంటల్లో తుస్సుమన్నాయి. అర్థం లేని హడావుడి తప్ప సినిమాలో విషయం లేకపోయింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉండి ఫ్రీగా సినిమా చూసిన వాళ్లు కూడా సమయం వృథా అని తిట్టిపోశారు. కేవలం కీర్తి పేరు చెప్పి ఈ సినిమాను సేల్ చేయడం పట్ల ఇప్పుడు అందరూ మండిపడుతున్నారు. ‘మహానటి’ తర్వాత కీర్తి మీద అంచనాలు మామూలుగా లేవు. ఆమె స్టార్ల సరసన నటించిన కమర్షియల్ సినిమాల్ని కూడా తన కోసమే చూసే ప్రయత్నం చేశారు ఫ్యాన్స్.

‘పందెంకోడి-2’, ‘సామి-2’ లాంటి సినిమాలు అలాగే ఆశలు రేకెత్తించాయి. తీరా చూస్తే వాటిలో కీర్తి పాత్రలూ బాలేవు. సినిమాలూ బాగాలేవు. కనీసం ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలైనా బాగుంటాయేమో అని చూస్తే ‘పెంగ్విన్’ ఆ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో ‘మిస్ ఇండియా’; ‘గుడ్ లక్ సఖి’ సినిమాలపై అంచనాలు తగ్గించుకుంటున్నారు జనాలు. ఏదేమైనా ‘మహానటి’ పేరు చెప్పి కీర్తి సినిమాలు అమ్ముకోవాలని చూడటం కాకుండా కంటెంట్ మీద ఫిలిం మేకర్స్ దృష్టిపెట్టాలన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

Next Story