కేసీఆర్‌ను కలవరపెడుతున్న బీజేపీ..

By అంజి  Published on  2 Feb 2020 1:01 PM GMT
కేసీఆర్‌ను కలవరపెడుతున్న బీజేపీ..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఫలితాల అనంతరం టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ జనతా పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పలువురు ముఖ్యమంత్రులను ఒకే వేదిక మీదకు తీసుకొని వస్తానని అన్నారు. మౌనంగా ఉండటం దేశానికి క్షేమం కాదని, సీఏఏను కేంద్రం వెనక్కు తీసుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం ఉండాలని కేసీఆర్ అన్నారు. సీఏఏ వంద శాతం తప్పుడు బిల్లు అని, సీఏఏపై ప్రధాని మోదీ పునరాలోచించాలని ఆయన పేర్కొన్నారు. అమిత్‌ షా ఫోన్‌ చేసినప్పుడు మద్దతు ఇవ్వబోమని చెప్పామన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో సీఎంలతో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా కేసీఆర్ మరోసారి దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు.

కేసీఆర్ గతంలో కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకి వ్యతిరేకంగా తన గళం వినిపించారు. బీజేపీ పోతే కాంగ్రెస్.. కాంగ్రెస్ పోతే బీజేపీనే రావాలా.. తృతీయ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు ఏకమై.. దేశాన్ని పాలించే శక్తిగా రూపాంతరం చెందాలని కేసీఆర్ అభిలాష.. ఇదే గతంలో కూడా చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి గద్దె మీద ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావును కూర్చో పెట్టి.. దేశ రాజకీయాలపై దృష్టి సారించాలని భావిస్తున్నారని కథనాలు కూడా గతంలో వచ్చాయి. ఇప్పుడు మరోసారి యాంటీ-బీజేపీ వ్యాఖ్యలు కేసీఆర్ చేయడంతో సర్వత్రా ఆసక్తి మొదలైంది.

ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వం లేని చేత బలహీనపడుతూ వస్తోంది. కాంగ్రెస్ తర్వాతి స్థాయిలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోవాలని భావిస్తోంది. బీజేపీని తక్కువగా అంచనా వేయకూడదని భావిస్తున్న కేసీఆర్ కేంద్రంలో బీజేపీ చేస్తున్న తప్పులను ఎండగట్టి తెలంగాణలో ఆ పార్టీకి ఉన్న ఫాలోయింగ్ దెబ్బతీయడమే మొదటి కర్తవ్యం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుని ఎన్నికల ప్రచారంలోకి దిగింది. మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి మహామహులు వచ్చి ప్రచారం చేశారు. కానీ కేవలం రాజాసింగ్ తప్ప మరెవరూ గెలవలేకపోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు సాధించి అందరినీ షాక్ కు గురిచేసింది. రాజకీయ పండితులు కూడా బీజేపీకి ఆ స్థాయిలో తెలంగాణలో లోక్ సభ స్థానాలు వస్తాయని ఊహించలేకపోయారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలాన్ని పుంజుకుందని ఈ ఎన్నికల ద్వారా టీఆర్ఎస్ కు అర్థమైపోయింది. మొత్తం లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుని నేషనల్ ఫ్రంట్ అంటూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని అనుకున్న కేసీఆర్ కు ఈ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి.

తెలంగాణలో త్రిముఖ పోరు మాత్రం తథ్యమే..

ఫెడరల్ ఫ్రంట్ అంటూ పొలిటికల్ పార్టీలన్నీ కలిసి ఏమైనా ఉద్యమం చేశాయా అంటే అది కూడా లేదు. బీజేపీ, కాంగ్రెస్ లేని కూటమిలో వైసీపీ, బిజు జనతా దళ్ లాంటి పార్టీలు భాగస్వామ్యులుగా ఉంటాయని కూడా వార్తలు వచ్చాయి. కానీ లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మరోసారి దేశ ప్రజలు పట్టం కట్టడంతో నేషనల్ ఫ్రంట్ ను ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ కూడా దీనిపై మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు మరోసారి కేసీఆర్ నేషనల్ ఫ్రంట్ గురించి వ్యాఖ్యలు చేయడానికి ముఖ్య కారణం 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుండడంతో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ ఇప్పటికే ఝార్ఖండ్, మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోగా.. హర్యానాలో ఎలాగోలా నెట్టుకొచ్చింది. ఇక ఢిల్లీలో కూడా అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం లేదనే చెబుతున్నారు. బీహార్ లో కూడా పార్టీ గట్టెక్కడం కష్టమే..! ముఖ్యంగా సిఏఏకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతూ ఉండడంతో పశ్చిమ బెంగాల్ లో కూడా బీజేపీకి చెప్పుకోదగ్గ సీట్లు రావడం గగనమే. సిఏఏకు చాలా మంది వ్యతిరేకిస్తూ ఉండడం.. యంగ్ ఓటర్లు కూడా ఇలాంటి పాలిటిక్స్ పై పెదవి విరుస్తూ ఉండడంతో బీజేపీ ఓటు బ్యాంకు క్షీణించడానికి ముఖ్య కారణం. అందుకే మరోసారి కేసీఆర్ నేషనల్ ఫ్రంట్ అంటూ పలు పార్టీలను ఏకం చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాల్లో తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా కాంగ్రెస్ కు సరైన నాయకుడు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారింది.

ఇలాంటి సమయంలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాగా.. టీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. 43 శాతం ఓట్లు టీఆర్ఎస్ కు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ 21.71 శాతం ఓట్లను రాబట్టుకోగా.. బీజేపీ 14.94 కు పరిమితం అయింది. అలాగని బీజేపీని తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది కేవలం 7 శాతమే.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఏకంగా నాలుగు సీట్లు సంపాదించింది. టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం బీజేపీ అవ్వాలంటే ఇంకా ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి మాత్రం నిజం ఇకపై తెలంగాణలో త్రిముఖ పోరు మాత్రం తథ్యమే. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేసే పనుల వలన కూడా తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగే అవకాశమే ఉంది. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తే తెలంగాణ బీజేపీకి కూడా అంతే ప్రమాదం పొంచి ఉంది. నాలుగు మున్సిపాలిటీల్లో బీజేపీకి 30 నుండి 40 శాతం దాకా ఓట్లు దక్కాయి. అలాగే 14 మున్సిపాలిటీల్లో 20 నుండి 30 శాతం, 40 మున్సిపాలిటీల్లో 10 నుండి 20 శాతం ఓట్లు వచ్చాయి.

ఇప్పటికే కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు..

కేసీఆర్ పార్టీ పగ్గాలు ఇప్పటికే కేటీఆర్ కు అప్పగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ఇప్పటికే భారీగా ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. మంచి నాయకత్వ పటిమ కూడా ఆయన సొంతం. తెలంగాణ తర్వాతి ముఖ్యమంత్రి ఆయనే అని ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ చేసిన తప్పును వేరెవరూ చేయకూడదని ఇప్పటికే భావిస్తున్నారు. 2009లో రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీ మీద కూర్చొని పెట్టి ఉంటే కాంగ్రెస్ కు ఇలాంటి గతి పట్టేది కాదు. ఇక ములాయం సింగ్ యాదవ్ కూడా తన కొడుకును రాటు దేల్చే పనుల్లో పడ్డారు. చంద్రబాబు నాయుడు కూడా తన కొడుకు నారా లోకేష్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందుకే కేసీఆర్ వచ్చే ఎన్నికల్లోపు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్నారు. అలాగే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. సిఏఏకు వ్యతిరేకంగా అతి పెద్ద సభ నిర్వహించి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. కేసీఆర్ ఎంత పక్కా ప్రణాళికతో ముందుకు వెళతారో సమయమే చెబుతుంది.

Next Story