ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి.. లేదంటే చర్యలే: కేసీఆర్‌

By సుభాష్  Published on  20 April 2020 1:45 AM GMT
ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి.. లేదంటే చర్యలే: కేసీఆర్‌

దేశ వ్యాప్తంగా కరోనా కాలరాస్తుండటంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నారు. అత్యధికంగా ఉన్న కేసులు ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌కు చెందినవేనని గుర్తించారు అధికారులు. కాగా, నిన్న ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ తీరు, లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరుపై సమావేశంలో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లడారు.

మే 7వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఫీజుల గురించి విద్యార్థుల తల్లిదండ్రులను పట్టిపీడించవద్దని కోరారు. 2020-21 సంవత్సరానికి గానూ ఎలాంటి ఫీజులు పెంచవద్దని, ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని సూచించారు. అది కూడా నెలవారీగా వసూలు చేయాలి తప్ప ఒకే సారి చెల్లించాలని వేధించవద్దని పేర్కొన్నారు. అధిక ఫీజు వసూలు చేసినట్లయితే విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక వేళ అధి ఫీజులు వసూలు చేస్తే 100 నంబర్‌కు డయల్‌ చేయాలని, వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. కరోనా కష్టకాలంలో అధిక ఫీజుల జోలికి వెళ్లవద్దని అన్నారు. రాష్ట్రంలో 10వేలకుపైగా ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించవద్దని హెచ్చరించారు.

ఉచిత బియ్యం

కరోనా ఇబ్బందుల నేపథ్యంలో ఏప్రిల్‌ నెలలో ఇచ్చిన 12 కిలోల బియ్యం మాదిరిగానే వచ్చే నెలలో కూడా ఉచిత బియ్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబానికి కూగాయలు, ఇతర అవసరాల కోసం మే మొదటి వారంలోనే రూ.1500 ఇచ్చేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో జమ అయిన డబ్బులు వెనక్కి వెళ్లవని, ఒక వేళ డబ్బులు తీసుకోకుంటే వెనక్కి వెళ్లిపోతాయని లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దని, ఒకసారి ఖాతాలు డబ్బులు పడితే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఖాతాలో నుంచి మీరు తీసుకున్నా.. తీసుకోకపోయినా అలాగే ఉంటాయని తెలిపారు.

ఏ పండగలైనా ఇంట్లోనే..

ప్రజలు ఏ పండగలు చేస్తుకున్నా ఇంట్లోనే చేసుకోవాలని, బయటకు మాత్రం రావద్దని సూచించారు. అలాగే మందిరాల్లో చేసుకునే ప్రార్థనలు సైతం హిందూ, ముస్లిం, క్రిష్టియన్లు ఇతర వారు కూడా ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థతుల్లో బయటకు రావోద్దని అన్నారు.

అలాగే ఏప్రిల్‌ నెలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల వేతనం మాదిరిగానే 50 శాతం, ప్రజాప్రతినిధులకు 75 శాతం కోత విధిస్తామన్నారు. లక్షా 11వేల మంది పెన్షనర్ల కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 75శాతం చెల్లిస్తామన్నారు.

అలాగే వైద్య, మున్సిపల్‌, హెచ్‌ఎండీఏ, గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి వారి వేతనం మీద 10శాతం అధికంగా చెల్లిస్తామన్నారు. విద్యుత్‌ సరఫరా, విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థల్లో పని చేస్తున్న 34,512 మంది ఓఅండ్‌ఎం సిబ్బంది, ఆర్టిజన్లకు మార్చి నెల జీతం 50 శాతం ఇచ్చామని, ఏప్రిల్‌ వేతనం వంద శాతం చెల్లిస్తామని తెలిపారు. అలాగే ఆసరా పింఛన్లు మే నెలకు సంబంధించినవి యథాతథంగా అందజేస్తామన్నారు.

Next Story