ఆలా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది : సీఎం కేసీఆర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2020 6:29 AM GMT
ఆలా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది : సీఎం కేసీఆర్

రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధువుగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు కూడా రైతు నేస్తాలుగా మరింత పట్టుదలతో.. సమన్వయంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం ప్రగతి భవన్ లో జరిగిన అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారులు ఎవరికి తోచినట్టు వారుగా కాకుండా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా, పై అధికారుల ఆదేశాలను అనుసరించి నడుచుకోవాలని సూచించారు.

మార్కెట్లో సరైన ధరలు లభించే అవకాశం ఉన్న పంటల రకాలను ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించే బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదే అని సీఎం అన్నారు. తమ ఇష్టానుసారం కాకుండా అన్ని జిల్లాల అధికారులు తమ ఉన్నతాధికారులనుంచి వచ్చిన ఆదేశాల మేరకే కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం దృష్ట్యా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆలోచనా ధృక్పథాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాలన్నారు. తెలంగాణ సాగు బాగు కోసం వ్యవసాయశాఖ అధికారులు ఉమ్మడి కుటుంబంలా సమన్వయంతో పనిచేయాలన్నారు.

మక్కపంటకు విరామమే మంచిది:

మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర రావట్లేదని, క్వింటాలుకు ఎనిమిది, తొమ్మిది వందల రూపాయలకు మించి ధర పలకడం కష్టసాధ్యమైన నేపథ్యంలో అదే ధరకు అమ్ముకోదలచిన రైతులు మాత్రమే మక్కపంట వేసుకోవాలనే విషయాన్ని మరింతగా అర్థం చేయించాలని సీఎం మరో మారు స్పష్టం చేశారు.

సీఎం మాట్లాడుతూ ‘‘తెలంగాణ వ్యవసాయం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నది. వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని రకాల వ్యవస్థలు అందుకనుగుణంగా సమన్వయంతో పనిచేయాల్సి వున్నది. ప్రభుత్వ సూచనలను గౌరవించి నియంత్రిత వ్యవసాయానికి రైతులు అలువాటు పడుతున్నరు. వారికి ఏ పంటవేయాలి ఎట్లా దిగుబడిని పెంచాలి అనే విషయాలను ఎప్పటికప్పుడు వివరించాల్సిన బాద్యత వ్యవసాయ శాఖదే. అధిక దిగుబడులతో పంటలు పండిచడమే కాదు, రైతులు పండించిన పంటకు మంచి ధర వచ్చేందుకు ఎటువంటి మార్కెటింగ్ పద్ధతులను అవలంభించాలో, అందుకు తగ్గట్టు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి’’ అని సీఎం వివరించారు.

‘‘మక్కజొన్నలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అనుకూలత లేదు. దానికితోడు కేంద్రం దిగుమతి సుంకాలు తగ్గించి లక్షలకొద్దీ టన్నులు దిగుమతి చేసుకోవడం, పక్కరాష్ట్రాల్లో మక్కలు తక్కువ ధరలకే లభించడం వంటి అంశాలు మొక్కజొన్న పంటసాగును నిరుత్సాహపరుస్తున్నవి. ఈ నేపథ్యంలో ఏపంటలు పండించాలనే విషయంపై రైతులకు సరియైన సమాచారాన్ని చేరవేయాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులదే’’నని సీఎం స్పష్టం చేశారు.

‘‘మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర రాదు అని తేల్చిచెప్పండి. ఇందులో మొహమాటానికి పోయి సగం సగం సమాచారం ఇవ్వడం ద్వారా రైతు మొక్కజొన్న పంటవేసి నష్టపోయే ప్రమాదమున్నది. వానాకాలం మాత్రమే కాదు యాసంగిలో కూడా మొక్కజొన్న పంటకు మద్ధతు ధర వచ్చే పరిస్థితి లేదు. క్వింటాలుకు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల లోపే ధర పలికే పరిస్థితి వున్నదనే విషయాన్ని రైతుకు స్పష్టం చేయండి, అయినా మక్కలు పండిస్తం అంటే.. ఇక రైతుల ఇష్టం’’ అని సీఎం స్పష్టం చేశారు.

శరవేగంగా వ్యవసాయాభివృద్ధి - బుల్లెట్ లాగా దూసుకురానున్న పంటలు:

తెలంగాణ వ్యవసాయరంగాన్ని నియంత్రిత పద్ధతిలో మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ .. ‘‘తెలంగాణ రాష్ట్ర సాధనానంతరం మొదట ప్రారంభించిన ప్రభుత్వ కార్యక్రమం మిషన్ కాకతీయ. వలస పాలకులు ఆగం చేసిపోయిన గొలుసుకట్టు చెరువులను పునరుజ్జీవింపచేసుకున్నాం. వాటిని సాగునీటి ప్రాజెక్టులతో నింపుకొన్నం. ఫలితంగా తెలంగాణవ్యాప్తంగా చెరువులు నిత్యం మత్తడి దునుకుతున్నయి. బోర్లు నీటితో పైకి ఉబుకుతున్నయి. గత పాలనలో తెలంగాణ వ్యవసాయం గాలికి దీపం పెట్టి దేవుడా అనే పద్ధతిలో సాగింది. ఇప్పుడు ప్రభుత్వ సాయంతో రైతులు స్వయం సమృద్ధితో పంటలు పండిస్తున్నారు. వారికి సకాలంలో పంటపెట్టుబడి అందుతున్నది. నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్తుతో పాటు, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీళ్లు కూడా అందుతున్నవి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర విభజన సమయానికి కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వసామర్థ్యం కలిగిన గోదాములను తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచడం మామూలు విషయం కాదు. పెండింగు ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ, అడవుల పెంపకంతో.. వలసల జిల్లాగా పేరుపోయిన పాలమూరు జిల్లా ఇవ్వాల అత్యధిక వర్షాపాతం కలిగిన జిల్లాగా మారిపోయింది. గతంలో పాలమూరు వలసపోయేది, ఇప్పుడు ఇతర జిల్లాలనుంచే అక్కడికి వ్యవసాయ కూలీలు వలస వస్తున్నరు. పాలమూరు వ్యవసాయం అభివృద్ధి చెందడం తెలంగాణ వ్యవసాయం అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది’’ అని సీఎం అన్నారు.

రేపు రాబోయే యాసంగి సీజన్ కు దాదాపు 70 లక్షల ఎకరాలు వ్యవసాయానికి సిద్ధమైనాయని ఉన్నతాధికారులు రిపోర్టులు సిద్దం చేసినారంటే.. దీన్నిబట్టి, తెలంగాణ వ్యవసాయం, దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నదని స్సష్టమైతున్నదని సీఎం అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పట్ల వున్న అభిప్రాయాలను తెలంగాణ స్వయం పాలన తిరగరాసిందన్నారు. గతంలో ‘వ్యవసాయం చేసుడు కన్నా పాన్ డబ్బా నడుపుకునుడు నయం’ అనే సామెత వుండేదని కానీ ఇప్పుడు వ్యవసాయమే లాభసాటి వ్యాపారంగా మారిందన్నారు. గతంలో వ్యవసాయం చేసే యువకునికి పిల్లనివ్వాలంటే ఇష్టపడేవారు కాదు, కానీ నేడు ఐటి రంగంలో ఉన్నతస్థాయిలో జీతాలు తీసుకునే యువతీ యువకులు సైతం వ్యవసాయం బాట పట్టినారని సీఎం వివరించారు. తెలంగాణ రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలనే కాకుండా కేంద్రాన్నికూడా ప్రభావితం చేసిందన్నారు. ఒడిషా ప్రభుత్వం కాలియా పేరుతో తెలంగాణ అమలు పరుస్తున్న రైతుబంధు పథకాన్ని తమ రాష్ట్రంలో ప్రవేశపెట్టిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనముందే విలేకరులకు చెప్పడం తెలంగాణకు గర్వకారణమని సీఎం తెలిపారు.

కేంద్రం అమలు పరుస్తున్న కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకమే ఆదర్శంగా నిలిచిందని సిఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతుబీమా పథకం ప్రపంచంలోనే మరెక్కడా అమలులోలేదన్నారు.

‘‘జనాభా పెరుగుతున్నది గాని భూమిపెరగడం లేదు భవిష్యత్తులో సిమెంటు ఫ్లోర్లు మీద వ్యవసాయం చేసే పరిస్తితి రాబోతున్నదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నరు. అభివృద్ధి చెందిన దేశాల్లో రైతును చాలా గౌరవిస్తరు. మన దగ్గరకూడా అదే పరిస్థితి రావాలి. వ్యవసాయ రంగం జిడిపికి తక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుందనేది చాలా డొల్ల వాదన అని సీఎం అన్నారు. ఏడాదిలో తెలంగాణ మొత్తం పచ్చబడబోతున్నది. చాలా అద్భుతమైన తెలంగాణను చూడబోతున్నం. తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ ప్రజలు ఏమేమి తింటరనేది లెక్కలేకుండే. ఒక ప్రయివేట్ సంస్థతో నీనే స్వయంగా సర్వే చేయించిన. తెలిసిందేమిటంటే ఒకప్పుడు గ్రామాల్లో ఉచితంగా లభ్యమయ్యే చింతపండుకు లోటు ఏర్పడిందని సర్వేల తేలింది. యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల చింతపండును తెలంగాణ ప్రజలు వినియోగిస్తారని సర్వేల తేలింది. అప్పటికప్పడు అటవీ శాఖ ను అప్రమత్తం చేసి భారీ స్థాయిలో చింతచెట్లను నాటించిన.’’ అని అన్నారు.

దేవుడు తెలంగాణకు మంచి నేలలను ఇచ్చిండు. ప్రపంచానికే విత్తనాలను అమ్ముతున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతున్నది. గుజరాత్ వ్యాపారులు వాల్ల రాష్ట్రంలో పండే పత్తిని పక్కన పెట్టి, తెలంగాణ పత్తిని కొంటున్నరు. తెలంగాణ సోనా’ రకం వరిబియ్యాన్ని డయాబెటిక్ రోగులు తినవచ్చని, అమెరికా శాస్త్రవేత్తలు పరిశీలించి అక్కడి పత్రికల్లో ప్రచురించారని సీఎం వివరించారు.

వ్యవసాయ శాఖ మరింత డైనమిక్ గా పనిచేయాలి:

ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగానికి బాసటగా నిలిచి పనిచేయాల్సిన బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదేనని సీఎం అన్నారు. ప్రజల సంఘటిత శక్తిలో అద్భుతమైన బలం ఉంటుందనే విషయాన్ని గుర్తెరిగి వారిని ఐక్యం చేయాలన్నారు. 65 శాతం ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ వృత్తుల మీదనే ఆధారపడి వున్నారని, తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులదే ప్రధాన పాత్ర అని సీఎం తెలిపారు.

‘‘తెలంగాణ వ్యవసాయం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇకనుంచి తెలంగాణలో పంటలు బుల్లెట్లలా దూసుకువస్తాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుంటూ సరియైన దిశగా ప్రణాళికలు సిద్దం చేసుకోకపోతే వ్యవసాయశాఖకు ఇబ్బందులు తప్పవు. నియంత్రిత సాగును పకడ్బందీగా అమలుపరిచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి, అగ్రికల్చర్ ఎస్ఈజెడ్ ల ఏర్పాటు చేసి, తెలంగాణ రైతన్న పండించిన పంటలకు ఎక్కడికక్కడ మార్కెటింగు అవకాశాలను మెరుగుపరిచి వారి పంటలకు అధిక ధరలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మీదున్నదన్నారు.

తెలంగాణ వ్యవసాయానికి నాలుగు రకాల వ్యూహాలు:

తెలంగాణ ఏమి తింటుందో.. మార్కెట్లో ఏ పంటకు ధర వస్తుందో తెలుసుకోని అందుకు అనుగుణంగా పంటలను పండించాల్సి ఉందని సీఎం సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో సాంకేతికతను, యాంత్రీకరణను విరివిగా ఉపయోగించాలని.. ఆ దిశగా రైతాంగాన్ని చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం తెలిపారు. వ్యవసాయ శాఖ రైతు సంక్షేమ బాధ్యతను భుజాన వేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఈ దిశగా సరియైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఇందులో భాగంగా నాలుగంచెల వ్యూహాలను రూపొందించుకోవాలని సూచించారు.

రైతులు సరియైన ధరలు వచ్చే పంటలను మాత్రమే పండించేందుకు ప్రణాళికలను తయారు చేయడం, కల్తీ విత్తనాలు మార్కెట్ లో లభ్యం కాకుండా జాగ్రత్త పడుతూ నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేయడం, సరియైన సమయంలో ఎరువులను అందించడం, రైతు పండించిన పంటకు మంచి ధరలు లభించేలా చూడడం.. ఈ నాలుగు రకాల మార్కెటింగ్ వ్యూహాలను పటిష్టంగా అమలు పరచాల్సివుంటదని అధికారులకు సీఎం వివరించారు. అట్లా వాటిని అన్వయించుకోని పోయినప్పుడు మాత్రమే అది గొప్ప వ్యవసాయంగా మారుతుందని స్పష్టం చేశారు.

అగ్రికల్చర్ కార్డును రూపొందించే దిశగా..

రైతు సంక్షేమాన్ని గుర్తెరిగి పనిచేస్తే రైతుల విశ్వాసాన్ని చూరగొనడం పెద్ధ కష్టమేమీ కాదని, మా కోసమే అధికారులు పనిచేస్తున్నరనే సోయిని రైతుల్లో కలిగిస్తే రైతులు విశ్వశిస్తారన్నారు. తెలంగాణలోని పేద, బక్క, అన్నివర్గాల రైతులను వ్యవసాయశాఖ ఆలోచనల పరిధిలోకి తీసుకురాగలిగే విదంగా అధికారులు కృషి చేయాలన్నారు. అధికారులిచ్చే సరియైన సలహా సూచనలను అనుసరించి రైతులు వ్యవసాయ పద్ధతులను అలవాటు చేసుకుంటారన్నారు. అధికారులిచ్చే మంచి సూచనలు సలహాలు వారికి లాభదాయకంగా మారితే, రైతాంగం అధికారుల సలహాల కోసం ఎదురు చూస్తారని, ఆరోజు కోసం అధికారులు కృషి చేయాలని అధికారులకు సీఎం వివరించారు. ఏపంట వేయాలి ఏ పంట వేయకూడదు అనే విధానాలను రూపొందించి ‘డూస్ అండ్ డోంట్ డూస్‘ గురించి వివరిస్తూ వచ్చే ఏడాది నుంచే ‘అగ్రికల్చర్ కార్డు’ ను రూపొందించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు తమ శక్తి సామర్ధ్యాలను చాటుకోవాలన్నారు.

పెరిగిన వ్యవసాయశాఖ ప్రాధాన్యత:

నేర్పరితనం, కలుపుగోలుతనం, వృత్తి నైపుణ్యాలతో వ్యవసాయ శాఖ అధికారులు ముందుకు సాగాలన్నారు. అరమరికలు లేకుండా పెత్తనాల పంచాయితీలు లేకుండా మనసు పెద్ధది చేసుకుని ఆలోచిస్తూ కలిసిమెలిసి పనిచేయాల్సిన బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదేన్నారు. ‘‘టెన్ టు ఫైవ్ అన్నట్టుగా కాకుండా వ్యవసాయశాఖ నిరంతరం పనిచేయాల్సిన అవసరమున్నది. రైతాంగాన్ని చైతన్య పరిచేందుకు శాఖాపరంగా నిరంతర శిక్షణా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ పోవాలి. అద్భుతమైన అవగాహనతోని నిరంతరం సమీక్షాసమావేశాలను నిర్వహించుకూటూ సాగాలి. దసరాకల్లా రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలు సిద్ధం కానున్నాయి. రైతులతో నిరంతరం కలుస్తూ వారికి వ్యవసాయ సూచనలిస్తూ సమావేశాలు నిర్వహించాల్సి వస్తుంది. అందుకోసం మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అభివృద్ధి పథాన సాగుతున్న తెలంగాణ పల్లెల రూపురేఖలు పట్టణీకరణ చెందుతున్నాయి. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపొందిన నేపథ్యంలో రైతుల బాగుకోసం ఇంకా ఏం చేయాల్సి ఉందో ఆలోచించాలి. ఇప్పటిదాకా రైతులకు ఏ పంటవేయాలి, ఏది వేయొద్దు అనే సూచనలిచ్చే నాధుడేలేడు. బాగా పంటలు పండించిన రైతులు ధాన్యాన్ని మార్కెట్ కు తెచ్చే క్రమంలో ప్రవాహంలా ఒకేసారి ధాన్యంతో మార్కెట్ మీద పడడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటుంటారు. వారిని నియంత్రిత పద్ధతిలో మార్కెట్లకు వచ్చే విధంగా సూచనలు చేయాల్సిన అవసరమున్నది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. వ్యవసాయశాఖ మరింత చురుకుగా వుండాల్సిన అవసరమున్నది’’ అని సీఎం వివరించారు.

Next Story