నేడు అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష..లాక్‌డౌన్ సడలింపులపై ఉత్కంఠ
By సుభాష్ Published on 15 May 2020 7:38 AM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా వైరస్, లాక్‌డౌన్ తీరుపై సమీక్షించనున్నారు. అయితే తెలంగాణలో అమలవుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో కొన్ని సడలింపులు ఉంటాయని గత సమావేశంలో కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి సడలింపులు ఇస్తారోనని అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక పదో తరగతి విద్యార్థుల పరీక్షలపై ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో వివిధ పద్దతుల్లో పంటలను సాగు చేయాల్సిన అవసరం, వివిధ అంశాలపై కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.
కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటంతో ఆ పరిధిలో బస్సులు నడిపే అవకాశం లేదు. గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్‌లలో కొంత మేర బస్సులు నడపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ లేనందున కట్టడి చేసేందుకు భౌతిక దూరం తప్ప ఎలాంటి మార్గం లేదు.
కాగా, రెడ్ జోన్‌లలో కొన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెడ్ జోన్‌లలో నిత్యావసర దుకాణాలు, మద్యం దుకాణాలు, వ్యవసాయ, నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలకు అనుమతి ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 29 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యం ఎలాంటి సడలింపులు ఇస్తారోనని ఉత్కంఠ నెలకొంది.