ఆ ఆరు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి.. 29 వ‌ర‌కూ కర్ఫ్యూ ఉంటుంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 May 2020 3:16 AM GMT
ఆ ఆరు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి.. 29 వ‌ర‌కూ కర్ఫ్యూ ఉంటుంది

తెలంగాణ‌లో లాక్‌డౌన్ 7వ తేదీ నుండి ముగియ‌నున్న నేఫ‌థ్యంలో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి వేదిక‌గా నిన్న మంత్రి వ‌ర్గ భేటీ జ‌రిగింది. సుమారు ఏడున్న‌ర గంట‌ల పాటు జ‌రిగిన ఈ సుదీర్ఘ‌మైన భేటీలో లాక్‌డౌన్ పై మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. అనంత‌రం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. మంత్రి వ‌ర్గ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు. ‌

కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో ఈ రోజుకు(ప్రెస్ మీట్ జ‌రిగే స‌మ‌యానికి) 1096 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి అన్నారు. మొత్తంగా 628మంది డిచార్జ్ అయ్యార‌ని.. నిన్న ఒక్క‌రోజే 43 మంది డిచార్జ్ అయ్యార‌ని తెలిపారు. ఇక ప్ర‌స్తుతం రాష్ట్రంలో 439 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయ‌ని.. నిన్న 11మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కంటైన్మెంట్ జోన్ అనే పదం తెలి‌య‌ద‌ని.. మొట్టమొదటి సారిగా కరీంనగర్‌లో కంటైన్మెంట్ ఏరియా ఏర్పాటు చేసామని.. త‌ద్వారా కరీంనగర్‌లో ఒక్క మృతి లేకుండా అందరిని కాపాడుకున్నామన్నారు.

ఇక దేశంలో మరణాల రేటు 3.37 శాతం ఉంటే.. తెలంగాణలో 2.64 మాత్రమే ఉందని అన్నారు. అధికారులందరి కృషి మంచి ఫలితాలు ఇచ్చిందని కొనియాడారు. భారత్ బయో టెక్, బయాలోజికల్ ఈవెంట్, శాంతా బయోటెక్ లాంటి సంస్థలు క‌రోనా వ్యాక్సిన్‌ కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నార‌ని.. అగ‌స్టు మాసం క‌ల్లా వ్యాక్సిన్ రావ‌చ్చొనే ఆశాభావం వ్య‌క్తం చేశారు. వీరి కృషి ఫ‌లించి వ్యాక్సిన్ మ‌న తెలంగాణలో త‌యార‌యితే ప్ర‌పంచానికి ప్రాణ‌దాత‌లం అవుతామ‌ని అన్నారు.

విదేశాల నుండి పెట్టుబడులు అన్ని ఇండియాకు వచ్చేనెదుకు సిద్ధంగా ఉన్నాయని.. 70 రోజులు వైరస్‌ను కంట్రోల్ చేస్తే వ్యాప్తిని మనం అరికట్టవచ్చని కేసీఆర్ అన్నారు. అందులో భాగంగానే లాక్‌డౌన్‌ను 29 మే వరకూ పొడిగిస్తున్నామన్నారు. అప్ప‌టి వ‌ర‌కూ ప్రజలందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ సహకరించాలని కోరారు. అలాగే.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోగులకు వైద్యశాఖ ఆధ్వర్యంలో కోటి మాస్కులు పంపిణీ చేస్తారని తెలిపారు.

తెలంగాణలో ఆరు జిల్లాలు రెడ్ జోన్ లో.. తొమ్మిది జిల్లాలు గ్రీన్ జోన్ లో.. మరో 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ఈ నేఫ‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు కచ్చితంగా ఫాలో చేయాల్సిందేన‌ని అన్నారు. వచ్చే 11 రోజుల్లో 18 జిల్లాలు కూడా గ్రీన్ జోన్ లో ఉంటాయని తెలిపారు. ఇక‌ రాష్ట్రంలో 35 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయని.. వాటిలో 19 జీఎచ్ఎంసీ ప‌రిధిలోనే ఉన్నాయ‌ని.. మిగ‌తావి ఇత‌ర జిల్లాల్లో ఉన్నా‌య‌ని పేర్కొన్నారు. హైదరాబాద్, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల‌లో ఎలాంటి సడలింపులు లేవని అన్నారు.

మొత్తం కేసుల్లో హైదరాబాద్, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే 726 కేసులు ఉన్నాయని.. రాష్ట్రం మొత్తంలో 66శాతం కేసులు ఈ మూడు జిల్లాల్లో ఉండ‌గా.. 34శాతం మిగతా జిలాల్లో నమోదు అయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ 29మంది మరణాలు ఉంటే.. 25మంది ఈ మూడు జిలాల్లోనే నమోదు అయ్యాయని అన్నారు. మరో మూడు రోజుల్లో సూర్యాపేట్, గద్వాల్, వికారాబాద్ రెడ్ జోన్ నుంచి వెళ్లిపోతాయని కేసీఆర్ అన్నారు.

రెడ్ జోన్‌ జిలాల్లో మరికొంత కాలం లాక్ డౌన్ అమలు చేయాలన్న కేసీఆర్‌.. గృహ నిర్మాణం కోసం కావాల్సిన దుకాణాలు మాత్రం తెరుస్తారని తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు పరిస్థితిని పరిశీలించి రెడ్ జోన్ సడలింపులు పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మే 16 నాడు మళ్ళీ రివ్యూ చేస్తామ‌ని అప్పుడు నిర్ణయం ప్రకటిస్తామ‌ని అన్నారు. గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్ లలో.. మండల స్థాయిలో అన్ని షాప్స్ తెరుచుకోవచ్చని తెలిపారు. ఇక మున్సిపాలిటీలలో 50శాతం మాత్రమే తెరుస్తూ.. సరిబేసి విధానం అమ‌లు చేస్తార‌ని అన్నారు. అయితే మే 29వ‌ర‌కూ రాష్ట్రంలో సాయంత్రం 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని అన్నారు. ఇది అన్ని జోన్‌ల‌కు వ‌ర్తిస్తుంద‌ని అన్నారు.

వలస కార్మికులు 7 ఏడున్నర లక్షల మందికి రేషన్ పంపిణీ చేసామని.. ఉద‌య‌మే మొత్తం 11 ట్రైన్స్ ద్వారా వారిని ఇతర రాష్ట్రాలకు పంపామ‌న్నారు. అలాగే.. 12వందల మంది కార్మికులను బీహార్ నుంచి తెలంగాణకు రప్పిస్తున్నామన్నారు. రైతుబంధు కార్యక్రమంపై ఎలాంటి అనుమానాలు వద్దని.. ఒక్క రూపాయి తగ్గించకుండా నిధులు ఇస్తామ‌ని రైతుల‌కు భ‌రోసా ఇచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టత పరిపూర్ణం కావాలని.. 25వేల వరకు ఉన్న రుణాలున్న ఐదున్నర లక్షల మందికి వ‌ర్తించేలా 11వందల కోట్ల రైతు రుణమాఫీ రేపే చేస్తామ‌ని అన్నారు. రైతులకు నిధులు అందడం లేదు.. అనడం అవాస్త‌వ‌మ‌ని.. ఎక్కడ రావడం లేదో చెప్తే.. నేనే వస్తాన‌ని ప్ర‌తిప‌క్షాల‌కు స‌వాల్ విసిరారు.

Next Story