జాతీయ రాజకీయాల్లోకి కేసీయార్.. కొత్త పార్టీ 'నయా భారత్' ?
By సుభాష్ Published on 7 Sep 2020 6:45 AM GMTజాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే టార్గెట్ తో తెలంగాణా సిఎం కేసీయార్ కొత్త పార్టీని పెడుతున్నాడా ? ఆ పార్టీకి నయాభారత్ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్యానర్ కథనంగా ఇచ్చింది. తొందరలో దేశంలో అధ్యక్ష తరహా విధానం అమలు చేయాలన్న బిజెపి వ్యూహాన్ని ధీటుగా ఎదుర్కొనే ఉద్దేశ్యంతోనే కేసీయార్ కూడా పావులు కదుపుతున్నట్లు కథనంలో చెప్పింది. ఇప్పటికే ఇదే విషయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తో కూడా కేసీయార్ చర్చించాడట. నయాభారత్ పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ కూడా ప్రారంభమైందనేది సమాచారం. బిజెపి అధ్యక్షతరహా ఎన్నికల విధానాన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే బిజెపియేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కేసీయార్ అభిప్రాయపడుతున్నాడు.
బిజెపి అధ్యక్షతరహా ఎన్నికలంటే బహుశా ఇపుడున్నట్లు ప్రధానమంత్రి పదవి స్ధానంలో అధ్యక్షుడే పవర్ ఫుల్ అవుతాడేమో. అధ్యక్షతరహా ఎన్నికల్లో పాల్గొనాలంటే కేవలం జాతీయపార్టీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలన్నది బిజెపి నేతల వ్యూహంగా కేసీయార్ పసిగట్టాడట. ప్రాంతీయ పార్టీలన్నీ భవిష్యత్తులో కేవలం అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితమైపోతాయని సదరు పత్రిక చెప్పింది. కాబట్టి జాతీయ స్ధాయిలో పెద్ద ఫ్రంట్ ను ఏర్పాటు చేసి బిజెపిని గట్టిగా ఎదుర్కొనే ఉద్దేశ్యంతోనే తానే ఓ జాతీయపార్టీ నయాభారత్ ను ఏర్పాటు చేయాలని కేసీయార్ ప్రయత్నాలు చేసినట్లు చెప్పటం విచిత్రంగా ఉంది. ఇక్కడ విచిత్రం అని ఎందుకంటున్నామంటే ఇదే పేరుతో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు ఇప్పటికే నయాభారత్ పేరుతో కొత్త పార్టీలను రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పింది.
కేసీయార్ కంటే ముందే పై రెండు రాష్ట్రాల్లో నయాభారత్ పేరుతో ఓ పార్టీ రిజిస్టర్ అయితే ఇక అదే పేరుతో కేసీయార్ ఎలాగ కొత్త పార్టీని పెడదామని అనుకుంటున్నాడో అర్ధం కావటం లేదు. పైగా కేసీయార్ ను నమ్మి ఎంతమంది జతకట్టడానికి ముందుకొస్తారో కూడా తెలీదు. ఎందుకంటే నిలకడలేని తనానికి కేసీయార్ పెట్టింది పేరు. అదే సమయంలో మమత బెనర్జీ లాంటి వాళ్ళని నమ్మటం కూడా చాలా కష్టం. తమిళనాడు, కర్నాటక లాంటి రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పటికే ఇటు యూపిఏలో లేకపోతే అటు ఎన్డీఏలోను సర్దుకునేశాయి. వాటిని బయటకు తీసుకొచ్చి కొత్త ఫ్రంటులో చేర్చుకోవటం అంత ఈజీ కాదు. పైగా కేసీయార్ ను నమ్మి ఎంతమంది వస్తారో తెలీదు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళటం పూర్తిగా కేసీయార్ ఇష్టమే. అంతేకానీ జాతీయ స్ధాయిలో ఎన్డీఏ+యూపీఏలకు ప్రత్యామ్నాయంగా బలమైన ఫ్రంటు ఏర్పాటు చేయటమంటే మామూలు విషయం కాదు. తానిచ్చిన కథనంలోనే పార్టీ పేరు, రిజిస్ట్రేషన్ విషయాల్లో ఆంధ్రజ్యోతి పరస్పర విరుద్ధమైన విషయాలను ప్రచురించింది. అధ్యక్షతరహా విధానాన్ని తీసుకురావాలని బిజెపి ఒక్కటి అనుకుంటే సరిపోదు. రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. అందుకు మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఆమోదం తెలపాల్సుంటుంది. పార్లమెంటులో చర్చలు జరగాలి, అవి నెగ్గి బిల్లుల రూపంలో ఆమోదం పొందేందుకు అధ్యక్షుని ముందుకు వెళ్ళాలి. అధ్యక్షుడి సంతకం కావటం సులభమే అయినా అంతకుముందు జరగాల్సిన కసరత్తు జరగటం అంత తేలిక్కాదు. ఈ కసరత్తుపై ఎవరైనా కోర్టులకు వెళితే అక్కడే విచారణ పేరుతో బ్రేకులు పడతాయని అందరికీ తెలిసిందే. సరే కేసీయార్ ప్రయత్నాలు ప్రారంభించాడని అంటున్నారు కదా చూద్దాం ఏం జరుగుతుందో.