రూ. 3 కోట్ల వ్య‌యంతో కేసీఆర్ నూత‌న పెంట్ హౌస్ కార్యాల‌యం.. ప్ర‌త్యేక‌త‌లివే..

By Newsmeter.Network  Published on  15 Dec 2019 2:14 PM IST
రూ. 3 కోట్ల వ్య‌యంతో కేసీఆర్ నూత‌న పెంట్ హౌస్ కార్యాల‌యం.. ప్ర‌త్యేక‌త‌లివే..

ముఖ్యాంశాలు

  • బి.ఆర్.కె.ఆర్ భవన్ 9వ అంతస్తుపై కొత్త కార్యాలయం నిర్మాణం
  • ఆగమేఘాలమీద నిర్మాణం పనులను పూర్తి చేస్తున్న ఆధికారులు
  • వాస్తవిక తుది గడువు మార్చ్ నెలఖరుగా నిర్ణయం
  • అవసరం రీత్యా జనవరి నెలకే నిర్మాణం పూర్తిచేసేందుకు యత్నాలు
  • జనవరి రెండో వారంలో సీఎం కేసీఆర్ చేతిమీదుగా ప్రారంభం
  • కోర్టు కేసులవల్ల అలస్యమవుతున్న కొత్త సెక్రటరియేట్ నిర్మాణం
  • అధికారిక సమీక్షలకోసం ఇకపై బి.ఆర్.కె.ఆర్ భవనం సీఎం కార్యాలయం
  • రూ. మూడు కోట్లతో సరికొత్త సీఎం కార్యాలయం నిర్మాణం
  • ఒకేసారి 300 మంది అధికారులతో సమావేశం కావొచ్చు
  • స్పెషల్ వి.ఐ.పి లాంజ్, మినీ కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు భవన్ పై తొమ్మిదో అంతస్తులో రూ.3 కోట్ల వ్యయంతో 600 చ.అ విస్తీర్ణంలో పెంట్ హౌస్ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. నూతన సచివాలయం నిర్మాణం కారణంగా వచ్చే సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యాలయాన్ని పలుమార్లు సందర్శించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

కొత్త సచివాలయం నిర్మాణం కారణంగా ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్న సెక్రటరియేట్ ను బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి తరలించిన విషయం తెలిసిందే. వివిధ కోర్టు కేసుల వల్ల కొత్త భవనాల నిర్మాణం ఆలస్యం అయ్యింది.

కొత్త సెక్రటరియేట్ ను ఏర్పాటు చేయడం ఆలస్యం అవుతున్న కారణంగా ప్రభుత్వ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం కావడానికి ప్రత్యేకించి ఒక కార్యాలయం కావాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో బూర్గుల రామకృష్ణారావు భవనంమీద తొమ్మిదో అంతస్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ప్రత్యేకంగా కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు అధికారులు.

తెలంగాణ స్టేట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్

ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాలతో తెలంగాణ స్టేట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ బూర్గుల రామకృష్ణారావ్ భవనంపై అంతస్తులో కొత్తగా ఏర్పాటు చేయదలచిన ముఖ్యమంత్రి సమావేశ మందిరాన్ని నిర్మిస్తోంది. ఈ సమావేశ మందిరంలో ఒకేసారి మూడు వందల మంది అధికారులకు కూర్చోవడానికి సదుపాయం కల్పిస్తున్నారు. అదే విధంగా ఇదే సమావేశ మందిరంలోనే స్పెషల్ వి.ఐ.పి లాంజ్ ని, మినీ కాన్ఫరెన్స్ హాల్ ని కూడా నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది.

జెఎన్టీయూ ఇంజినీర్లు బూర్గుల రామకృష్ణారావు భవనం సామర్థ్యాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో ఒక నివేదిక అందజేసిన తర్వాతే అధికారులు భవనం పై అంతస్తుపై సమావేశ మందిరాన్ని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించిన తర్వాత ఆయన ఆదేశాల ప్రకారం ఈ సరికొత్త నిర్మాణాన్ని చేపట్టారు.

బూర్గుల రామకృష్ణారావు భవనం హుస్సేన్ సాగర్ సమీపంలోనే ఉన్నందున భవనం తొమ్మిదో అంతస్తుపై నిర్మిస్తోన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, సమావేశ మందిరాన్ని 180 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల్ని తట్టుకునే విధంగా సరికొత్త సాంకేతిక నైపుణ్యంతో నిర్మిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ఈ సరికొత్త కార్యాలయం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అధికారులు మార్చ్ నెలాఖరును తుది గడువుగా నిర్ణయించినప్పటికీ కార్యాలయం అత్యవసరంగా అవసరమైన కారణంగా ఈ నిర్మాణాన్ని జనవరిలోగానే పూర్తి చేయబోతున్నారు. ఆగమేఘాలమీద నిర్మాణం పనులు సాగుతున్నాయి. జనవరి రెండో వారంలోనే ముఖ్యమంత్రి ఈ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు.

Next Story