16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక భేటీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2020 7:23 AM GMT
16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక భేటీ

ఈనెల 16న సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రిత సాగు, ప్రధాని మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌ తదితర అంశాల గురించి చర్చించనున్నారు. 16న ఉదయం 11.30గంటలకు ఈ సమావేశం జరగనుంది. అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, జిల్లా పరిషత్‌ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

దేశంలో కరోనా పరిస్థితిపై ఈ నెల 16,17 తేదీలలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. 17న ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్లతో చర్చించి స్థానికంగా ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకోనున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత పరిణామాలు, ప్రజలు, వివిధ రంగాల స్థితిగతుల గురించి చర్చించనున్నారు. నియంత్రిత సాగు విధానం పై కూడా చర్చించనున్నారు. ఈ నెల 20 నుంచి హరితహారం ప్రారంభం కానుంది. హరితహారం అమలు గురించి సీఎం సమీక్షించనున్నారు.

Next Story