కేసీఆర్‌ అత్యున్నత స్థాయి సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం

By Newsmeter.Network  Published on  24 March 2020 6:36 AM GMT
కేసీఆర్‌ అత్యున్నత స్థాయి సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం

కరోనా వైరస్‌ భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నా.. పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 492కు చేరుకున్నాయి. తొమ్మిది మంది మరణించారు. ఇటు తెలంగాణలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి 33 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో కరోనా అనుమానితులు ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.

Also Read :కరోనా నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌.. వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి

ఇప్పటికే తెలంగాణలో లాక్‌ డౌన్‌ కోనసాగుతుంది. సోమవారం లాక్‌ డౌన్‌ ఉన్నప్పటికీ ప్రజలు రోడ్లపైకి రావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో మధ్యాహ్నం నుంచి అనవసరంగా రోడ్లపైకి వచ్చినవారి పట్ల కఠినంగా వ్యవహరించింది. ఇదిలా ఉంటే ఉదయం 6గంటల నుంచి రాత్రి 7గంటల వరకు నిత్యావసర వస్తువులకు సంబంధించి దుకాణాలు, పాలు, గ్యాస్‌, పెట్రోల్‌ బంక్‌లు ఇలా పలు వాటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సోమవారం ఒక్కరోజే ఆరు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం మరింత కఠిన నిర్ణయాలు తీసుకోనుంది. పూర్తిస్థాయిలో ప్రజలు ఇండ్లకే పరిమితమవ్వడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చనే భావనతో సీఎం కేసీఆర్‌ మరిన్ని కఠిన చర్యలు తీసుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read :ప్రపంచ వ్యాప్తంగా 16,500కు చేరిన కరోనా మృతుల సంఖ్య

దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం అత్యున్నత, అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్లో జరిగే సమావేశంలో వైద్య, ఆరోగ్య, పోలీస్‌, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులు పాల్గొనున్నారు. ఈసమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని ఈ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు సాయంత్రం సీఎం కేసీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది.

Next Story
Share it