కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. చైనాలోని వుహాన్‌ నగరంలో తొలిసారి వెలుగుచూసిన ఈ వైరస్‌.. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి వేలాది మంది ప్రాణాలు తీస్తుంది. కరోనా ప్రభావంతో అన్ని దేశాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నా.. కరోనా భారిన పడి మృతుల సంఖ్యను తగ్గడం లేదు. 24 గంటల్లోనే ఈ వైరస్‌ భారిన పడి 2వేల మంది మృతి చెందారంటే కరోనా వైరస్‌ ఎంత వేగంగా వ్యాప్తిచెందుతుందో అర్థమవుతుంది. ఇప్పటికే 197 దేశాలు ఈ వైరస్‌ను కట్టడి చేయడంలో తలమునకలయ్యాయి.

Also Read :భారత్ లో 20 కోట్ల మంది కరోనాతో చనిపోతారా.?

ఇప్పటి వరకు కరోనా వైరస్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 16,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఈ వైరస్‌ సోకిన వారి సంఖ్య 3లక్షల76వేలు దాటింది. వీరిలో 1.02 లక్షల మంది కోలుకున్నారు. 2లక్షల 60వేల మంది వైద్య చికిత్సలు పొందుతుండగా.. వీరిలో 12వేల మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఇదిలా ఉంటే అమెరికాలోనూ ఈ వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. సోమవారం ఒక్క రోజే ఆ దేశంలో 10వేల168 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. దీంతో ఆ దేశంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 43,734కు చేరింది. కరోనా వైరస్‌తో చికిత్స పొందుతూ 553 మంది మృతి చెందారు. సోమవారం ఒక్క రోజే ఏకంగా 140 మంది ప్రాణాలు కోల్పోయారంటే అమెరికాలో వైరస్‌ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.

Also Read :కరోనాపై వాట్సాప్‌లో వదంతులు.. రెండేళ్ల జైలు శిక్ష

మరోవైపు ఆయా దేశాల్లో సోమవారం మృతుల సంఖ్య భారీగానే ఉంది. సోమవారం ఒక్కరోజే స్పెయిన్‌లో 539, ఇరాన్‌లో 127, ఫ్రాన్స్‌లో 186, బ్రిటన్‌లో 54 మంది మృతి చెందారు. భారత్‌లోనూ ఈ వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే 469 మంది ఈ వైరస్‌ భారిన పడగా, ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందారు. పాకిస్తాన్‌లోనూ వైరస్‌ క్రమంగా విస్తరిస్తోంది. సోమవారం మరో 99 కేసులు నమోదు కాగా, సోమవారం నాటికి వైరస్‌ సోకిన వారి సంఖ్య 875కు చేరింది. దీంతో పాక్‌ ప్రభుత్వం వ్యాధి విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుటుంది. ఇదిలా ఉంటే చైనాలో ఈ వైరస్‌ వ్యాప్తి అనూహ్యంగా తగ్గింది. గత మూడు రోజులు ఈ దేశంలో కొత్తగా ఒక్క కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.

Also Read :క‌రోనా బారి నుండి ఆ హీరోయిన్ బ‌య‌ట‌ప‌డిందోచ్‌..

మరోవైపు దక్షిణ కొరియాలోనూ వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఆ దేశం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 11 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా సోమవారం కేవలం 64కేసులు మాత్రమే బయటపడ్డాయి. మొత్తం 8,911 మంది ఈ వైరస్‌ భారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటలీలో మాత్రం కరోనా మరణ మృదంగాన్ని మోగిస్తుంది. నివారణ చర్యలు చేపట్టినా ఈ దేశంలో రోజురోజుకు కేసుల నమోదు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటలీలో నిన్న ఒక్కరోజే 601 మంది మృతి చెందారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.