హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో కరోనా వైరస్‌పై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వదంతులను వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. కరోనా వైరస్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు దుర్మార్గులు వినిపించుకోవడం లేదు. అందుకు పాపన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మహమ్మారి కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం పైశాచికనందం పొందుతున్నారు. అయితే ఇలాంటి వారిని గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు పోలీస్‌ యంత్రాంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కరోనాపై తప్పుడు ప్రచారం చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే సమయంలో పోలీసులు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఎవరైనా సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తో.. జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిందే హెచ్చరించారు.

ఇటీవల వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఓ మహిళకు కరోనా సోకిందని వాట్సాప్‌ గ్రూప్‌లో తప్పుడు వార్తను ప్రచారం చేశారు. ఇలా తప్పుడు ప్రచారం చేసినందుకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. తాండూరులో మహిళకు కరోనా సోకిందని, ఇదే మొదటి కేసు అంటూ కొర్విచెడ్‌ గ్రామానికి చెందిన విజయ్‌ అనే వ్యక్తి తన వాట్సాప్‌ గ్రూపులో ఫేక్‌ పోస్టు పెట్టాడు. ఇగా ఇది నిజమేనని నమ్మిన మరికొందరు దీన్ని షేర్‌ చేశారు. ఇలా పోస్టు కాస్తా వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీస్‌ ఐటీ విభాగం ఫేక్‌ పోస్టు పెట్టిన విజయ్‌ కుమార్‌ను గుర్తించింది. అతడితో పాటు వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌గా ఉన్న వ్యక్తిపై ఐపీసీ 188, సెక్షన్‌ 54, ఎన్‌డీఎంఏ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. కరోనాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

టెక్నాలజీ యుగంలో కూడా భారత్‌లో మూఢ నమ్మకాలు, వదంతులు తగ్గడం లేదు. అమాయక ప్రజలు ఎది వింటే అదే నిజమని నమ్మేస్తున్నారు. “ఒక్క కొడుకు ఉన్న వాళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ల దగ్గరకు వెళ్లి చెంబెడు నీళ్లు ఐదుగురిని అడుక్కు వచ్చి వేప చెట్టుకు పోయాలని అప్పుడు కరోనా సోకదంటూ” వాట్సాప్‌లో కరోనా వైరస్‌పై వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.  వాట్సాప్‌పై పోలీసులు మరింత నిఘా పెంచాల్సి ఉంది. అప్పుడే తప్పుడు వార్తలకు కళ్లెం పడుతుందని పలువురు నెటిజన్లు అనుకుంటున్నారు.

వరంగల్‌లో ముగ్గురు అరెస్ట్‌

కరోనా వైరస్‌పై తప్పుడు వార్తను ప్రచారం చేసినందుకు ముగ్గురు యువకులను వరంగల్‌ అర్బన్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కమలాపూర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.రవిరాజు చెప్పిన వివరాల ప్రకారం.. పంగిడిపల్లికి చెందిన రాజేశ్‌ అనే వ్యక్తి ‘కమలాపూర్‌లో కరోనా వ్యక్తి గుర్తింపు.. ఎంజీఎంలో కరోనా కలకలం’ అంటూ వదంతులను వ్యాప్తి చేశారు. ఈ పోస్టులను సోషల్‌మీడియాలో పెట్టాడు. ఇక రాజేశ్‌ స్నేహితులు దాన్ని మార్ఫింగ్‌ చేసి ఏకంగా ఓ శాటిలైన్‌ ఛానెల్‌లో ప్రసారం అయినట్లు వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. నరెడ్ల రాజు, తమ్ము అనిల్‌ కుమార్‌, రాజేశ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేస్తే రెండేళ్లు జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద కూడా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.