ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ వణికిస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 3.75లక్షల మంది ఈ వైరస్‌ భారిన పడి చికిత్స పొందుతుండగా 16వేల మంది మృతి చెందారు. భారత్‌లోనూ ఈ వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే భారత్‌లో 490 మందికిపైగా ఈ వైరస్‌ భారిన పడి చికిత్స పొందుతుండగా తొమ్మిది మంది మృతి చెందారు. వైరస్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌ను విధించింది. ప్రజలెవరూ ఇంటి నుండి బయటకు రావొద్దని హెచ్చరించింది. ప్రజలు గుంపులు గుంపులుగా లేకుండా చూడటం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది.

కరోనా భయంతో వణుకుతున్న ప్రజలకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) గుడ్‌ న్యూస్‌ వినిపించింది. ఈ వైరస్‌ నుంచి తప్పించుకోవాలంటే.. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని ఐసీఎంఆర్‌ తెలిపింది. కరోనా వైరస్‌పై తాము ఏర్పాటు చేసిన జాతీయ బృందం దీనిని సిఫారస్సు చేసినట్లు పేర్కొంది. దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ మందు వాడకానికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా బాధితులకు, అనుమానితులకు, వైద్య సేవలు అందించే వారిలో కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను ఇవ్వొచ్చని ఐసీఎంఆర్‌ తెలిపింది.

కరోనా రోగుల బంధువులు కూడా తీసుకోవచ్చని పేర్కొంది. క్లోరో క్వీన్‌ వాడటంవల్ల దుష్ఫ్రభావాలు వస్తే వెంటనే హెల్ప్‌ లైన్‌ ద్వారాగానీ యాప్‌ ద్వారాగానీ ఫిర్యాదు చేయాలని ఐసీఎంఆర్‌ సూచించింది. ఇదిలాఉంటే ఈ మందులు వాడుతున్నప్పుడు కూడా కరోనా బాధిత కుటుంబ సభ్యులు ఆదేశాల మేరకు క్వారంటైన్‌లో ఉండాలని, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తున్న సమయంలో ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.

వైద్య సేవలు అందిస్తున్న వారు తొలి రోజు రెండుసార్లు 400 మిల్లి గ్రాములు చొప్పున వాడాలని, ఆ తర్వాత ఏడు వారాల పాటు వారానికి ఒకసారి 400 ఎంజీ భోజనంతో కలిపి తీసుకోవాలని ఐసీఎంఆర్‌ సూచించింది. రోగులతో కలిసి ఉంటున్న కుటుంబ సభ్యులు తొలిరోజు రెండుసార్లు 400 మిల్లి గ్రాములు, ఆ తర్వాత మూడు వారాలపాటు వారానికి 400 ఎంజీ చొప్పున భోజనంతో పాటు ఈ మందు తీసుకోవాలని వివరించింది. అయితే 15ఏళ్లలోపు చిన్నారుల్లో మాత్రం కోవిడ్‌ ముందస్తు నివారణకోసం ఈ ఔషధాన్ని ఉపయోగించకూడదని ఐసీఎంఆర్‌ హెచ్చరించింది.

సొంతంగా వాడితే గుండెపోటు ముప్పు..

ఐసీఎంఆర్‌ నుంచి వెలువడిన ప్రకటన ఇప్పుడు క్లోరోక్విన్‌ లాబ్లెట్లకు యమ డిమాండ్‌ను తీసుకొచ్చింది. దీంతో ప్రజలు మెడికల్‌ షాపుల్లో క్లోరోక్విన్‌ టాబ్లెట్లను తెగ కొనేస్తున్నారు. దీంతో స్పందించిన వైద్య విభాగం ఉన్నతాధికారులు ఈ మాత్రలను వైద్యుల సూచన మేరకే వాడాలని, లేకుంటే పెను నష్టం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు వైద్యుల సూచన లేకుండా క్లోరోక్విన్‌ టాబ్లెట్స్‌ వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించిన గాంధీ ఆసుపత్రి జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌, రాజారావు మీడియాకు ఓ ప్రెస్‌ రిలీజ్‌ విడుదల చేశారు. తెలంగాణలో ఈ మాత్రలకు డిమాండ్‌ పెరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్నవారే వీటిని వాడాలని, సొంతంగా వినియోగిస్తే గుండెపోటు ముప్పు ఒక్కసారిగా పెరిగిపోతుందని అన్నారు. ఇతర శారీరక రుగ్మతలు బాధిస్తాయని హెచ్చరించారు. మెడికల్‌ షాపుల యాజమానులు, వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా వీటిని విక్రయించరాదని సూచించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.