నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

By సుభాష్  Published on  2 July 2020 8:32 AM IST
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో మాత్రం పాజిటివ్‌ కేసులు వేగంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 2న తెలంగాణ మంత్రివర్గ భేటీ కానుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించాలని భారీ ఎత్తున డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్‌ పరిధిలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ అత్యంత కఠినంగా విధించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించడంతో కేబినెట్‌ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

లాక్‌డౌన్‌లో కర్ఫ్యూ మాత్రం కఠినంగా విధించాలని డిమాండ్‌ పెరుగుతోంది. రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిత్యావసరాల కోసం సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక జూలై 3 నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇక నిన్న ఒక్క రోజు కేసుల సంఖ్య పరిశీలిస్తే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4234 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 1018 కేసులు పాజిట్ కేసులు నమోదు అయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 17357 కేసులు నమోదు కాగా, 267 మంది మృతి చెందారు.

Next Story