లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ : ఎమ్మెల్యే కారు సీజ్
By తోట వంశీ కుమార్ Published on 30 April 2020 9:07 PM ISTకరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభిస్తోంది. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికి రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక ఈ మహమ్మారిని వ్యాప్తిని నియంత్రించడం కోసం లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. అయితే.. కొందరు లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమిస్తుండగా.. వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
తాజాగా.. తణుకు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కారును పోలీసులు సీజ్ చేశారు. కృష్ణా జిల్లాలో కైకలూరు అడిషనల్ ఎస్పీ సత్తిబాబు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించి తిరుగుతున్న పలు వాహానాలను గుర్తించి సీజ్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి తణుకు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు చెందిన ఏపీ39సీఎల్0126 ఫార్చునర్ కారు వచ్చింది. తణుకు చెందిన ఆ కారు ఎటువంటి అనుమతులు లేకుండా కృష్ణా జిల్లాలో ప్రవేశించడంతో ఆ కారును అడినల్ ఎస్పీ సీజ్ చేశారు. అయితే.. ఆ సమయంలో ఆ కారులో ఎమ్మెల్యే ఉన్నారో లేదో తెలియరాలేదు.