కార్తీకదీపం v/s ఐపీఎల్.. అభిమానికి వంటలక్క ఊహించని గిప్ట్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sep 2020 10:22 AM GMT
కార్తీకదీపం v/s ఐపీఎల్.. అభిమానికి వంటలక్క ఊహించని గిప్ట్‌

ప్రతి ఇంట్లో సీరియల్స్‌ చూడడం సహజం. అయితే.. ప్రస్తుతం ఐపీఎల్‌ ప్రారంభం అవుతుండడంతో.. కొందరికి తలనొప్పులు తప్పడం లేదు. నేను మ్యాచ్ చూస్తానని ఒకరు.. లేదు సీరియల్స్‌ చూస్తానని ఒకరు పోటీపడుతుంటారు. ఇంట్లో ఒకే టీవీ ఉంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి. లేకపోతే ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇంట్లో టీవీ ప్రోగ్రామ్స్ కోసం అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి.

'కార్తీకదీపం' సీరియల్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత డిమాండ్ ఉందో అందరికి తెలిసిందే. గత కొన్ని నెలలుగా సీరియల్ మొదలైన దగ్గరి నుంచి అత్యధిక టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ ప్రతిరోజు రాత్రి 7.30 గంటలకు ప్రసారమవుతుంది. ఇక ఇదే సమయంలో నేటి నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.

ఇటీవల..‘కార్తీకదీపం’ సీరియల్‌ కోసం ఐపీఎల్‌ సమయాన్ని మార్చాలంటూ సూర్యాపేటకు చెందిన పవిత్రపు శివచరణ్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో పాటు చెన్నై ఐపీఎల్‌ టీమ్‌, స్టార్‌ మాకి ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ‘ఇది అందరి ఇళ్లల్లో చాలా సీరియస్‌ ఇష్యూ. కార్తీక దీపం సీరియల్ కోసం ఐపీఎల్‌ మ్యాచ్‌లను రాత్రి 8 గంటలకు ప్రసారం చేయమని స్టార్‌ మా ఛానల్‌ను కోరుతున్నాను’ అని ట్వీట్‌‌లో పేర్కొన్నాడు. దీనిపై స్టార్‌ మా సానుకూలంగా స్పందించింది.

శివచరణ్ ట్వీట్ గురించి కార్తీకదీపంలో హీరోయిన్‌ దీప పాత్ర పోషిస్తున్న ప్రేమి విశ్వనాథ్‌కు తెలిసింది. తన సీరియల్‌ని, తనని తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానిస్తారని తెలుసు కానీ, ఒక సీరియల్‌ను మరీ ఇంతలా అభిమానించేవారు ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఐపీఎల్‌ టైమింగ్‌ మార్చడం కుదరని పని అని గ్రహించిన ఆమె వారి అభిమానానికి సంతోషించి తానే స్వయంగా ఓ మంచి స్మార్ట్ టీవీ కొని వారికి బహుమతిగా పంపించింది. టీవీతో పాటు ఓ ఉత్తరాన్ని కూడా శివచరణ్ ఇంటికి పంపించింది. ‘‘మీ అభిమానానికి మాటలు రావడం లేదు. ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి మీ మనవి నన్ను కదిలించింది. మీరు ట్విట్టర్‌లో చెప్పిన సమస్యకు పరిష్కారంగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కానుక పంపుతున్నాను. మీ ఇంట్లో కార్తీక దీపం ఇక వెలుగుతూనే ఉంటుంది. మీ అభిమానం మా పట్ల ఇలాగే ఉండాలని కోరుతున్నాను. మాస్క్ లేకుండా బయటకు వెళ్లకండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి’’ అని లెటర్‌లో పేర్కొంది. దాంతో పాటు 32 అంగుళాల టీవీని కూడా గిఫ్ట్‌గా పంపించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కార్తీకదీపం అభిమానులు ప్రేమి విశ్వనాథ్ ని తెగ పొగిడేస్తున్నారు. మాకు కూడా అలాంటి అవకాశం వస్తే బాగుండు అని అనుకుంటున్నారు.

Next Story