కేంద్ర బడ్జెట్‌: నోటితో మెచ్చుకుంటూ.. నొసటితో వెక్కిరించనట్టుంది..

By అంజి  Published on  2 Feb 2020 7:48 AM GMT
కేంద్ర బడ్జెట్‌: నోటితో మెచ్చుకుంటూ.. నొసటితో వెక్కిరించనట్టుంది..

హైదరాబాద్‌: మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా కేంద్ర బడ్జెట్‌ ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ అన్నారు. ఫెడరల్‌ స్ఫూర్తికి కేంద్ర బడ్జెట్‌ పూర్తి విరుద్ధంగా ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు. తెలంగాణ పథకాలను మెచ్చుకున్న కేంద్ర కేటాయింపులు మాత్రం చేయలేదన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని నిధులు కేటాయించమని ఎందుకు అడగరు అంటూ కర్నె ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పురోగమన దిశగా తీసుకెళ్లాల్సిందిపోయి.. అంకెల గారడీతో తిరోగమనం పాలు చేస్తోందన్నారు.

రాష్ట్ర విభజన జరిగి ఏడు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు విభజన హామీలను కేంద్రప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నోటితో మెచ్చుకుంటూ.. నొసటితో వెక్కిరించనట్టుందని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ అన్నారు. దేశం ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులను పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని కర్నె ప్రభాకర్‌ అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూసిందన్నారు. కేవలం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్‌ నిధులు కేటాయించారని.. మిగతా రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి చూపిందని కర్నె ప్రభాకర్‌ విమర్శించారు.

బీజేపీని ఆదరించని రాష్ట్రాలను అభివృద్ధిలో వెనక్కి నెట్టేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా కేంద్రం వ్యూహాం రచిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలకు కేంద్రం నిధులు కేటాయించిందా అని కర్నె ప్రభాకర్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో గ్రామ ఆర్థిక స్థితి గతులను మార్చివేసిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను సైతం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుందని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారని.. అది ఏ విధంగా సాధ్యమవుతుందో తెలంగాణ ప్రజలకు బీజేపీ నేతలు వివరించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ అన్నారు.

Next Story
Share it