రూ.15వేల ఉద్యోగం వ‌దులుకోవ‌డం వ‌ల్లే ఇదంతా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2020 3:13 PM GMT
రూ.15వేల ఉద్యోగం వ‌దులుకోవ‌డం వ‌ల్లే ఇదంతా..

టీమ్ఇండియా త‌రుపున అన్నాద‌మ్ములు క‌లిసి ఆడ‌డం చాలా అరుదు. ఇర్ఫాన్ ప‌ఠాన్‌, యూస‌ఫ్ ప‌ఠాన్‌ల త‌ర్వాత భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన సోద‌రులు హార్దిక్ పాండ్య‌, కృనాల్ పాండ్య‌. వీరిద్ద‌రు ఇండియ‌న్ ప్రీమియ‌ర్‌(ఐపీఎల్)లో ముంబై ఇండియ‌న్స్ త‌రుపున స‌త్తాచాటారు. దీంతో భార‌త జ‌ట్టులో త‌క్కువ కాలంలో చోటు సంపాదించారు. ఇక హార్దిక్ పాండ్య అయితే.. త‌న విధ్వంస‌క ఇన్నింగ్స్‌ల‌తో విరుచుకుప‌డుతున్నాడు. అటు బ్యాటింగ్‌తో ఇటు బౌలింగ్‌తో ఈ అన్నాద‌మ్ములిద్ద‌రూ ఆల్‌రౌండ‌ర్లుగా జ‌ట్టుకు ఉప‌యుక్తంగా మారుతున్నారు.

తాజాగా కృనాల్ పాండ్య ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌దులుకోవ‌డంతోనే భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించ‌డం సాధ్య‌మైంద‌ని నాటి రోజుల‌ను గుర్తుచేసుకున్నాడు. టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ జాన్‌ రైట్‌ వల్లే తమ ప్రతిభ వెలుగులోకి వచ్చిందని అన్నాడు.

"అప్పట్లో ముస్తాక్‌ అలీ టోర్నీ కోసం ట్రయల్స్‌ నడుస్తున్నాయి. అదే సమయంలో నాకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చినట్లు ఓ ఉత్తరం వచ్చింది. అది చూసిన మా నాన్న.. ఇది మంచి చాన్స్ .. నెల‌కి రూ.15-20వేలు సంపాదించ‌వ‌చ్చు అని నాతో అన్నారు. ఇన్నేళ్లుగా క‌ష్ట‌ప‌డింది క్రికెటర్ కావ‌డం కోస‌మేన‌ని, ఉద్యోగం కోసం కాద‌ని బావించి ఆ లెట‌ర్ ను చింపి ప‌డేసి ట్ర‌య‌ల్స్‌కు హాజ‌రయ్యాను. బ‌రోడా జ‌ట్టుకు ఎంపిక‌య్యాను. అయితే.. అప్ప‌టికే హార్ధిక్ ఆ జ‌ట్టులో స్థానం సంపాదించాడని" కృనాల్ తెలిపాడు.

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లు ముంబాయిలో జ‌రిగాయి. బ్యాటింగ్, బౌలింగ్ బాగా చేస్తున్నామ‌ని నా మీద, హార్ధిక్ మీద అప్ప‌టి ముంబై కోచ్ జాన్‌రైట్ ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపించాడు. మా ఇద్ద‌రిని ముంబై ఇండియ‌న్స్‌కు ఎంపిక చేయ‌డంతో మా త‌ల‌రాత‌లు మారిపోయాన‌ని చెప్పాడు. అప్ప‌ట్లో రూ.15వేల‌కు ఆశ‌ప‌డి ఉద్యోగానికి వెళితే.. మా జీవితాలు మ‌రోలా ఉండేవ‌ని కృనాల్ తెలిపాడు.

Next Story