ఎయిర్‌పోర్ట్‌లో ఉద్రిక్తత.. కట్టుదిట్టమైన భద్రతతో కంగనాను తరలించిన పోలీసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sept 2020 4:22 PM IST
ఎయిర్‌పోర్ట్‌లో ఉద్రిక్తత.. కట్టుదిట్టమైన భద్రతతో కంగనాను తరలించిన పోలీసులు

ముంబైకి వస్తాను దమ్ముంటే ఆపండి ఛాలెంజ్‌ చేసిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చెప్పినట్లుగా బుధవారం ముంబైలో అడుగుపెట్టింది. ఆమె రాకను వ్యతిరేకిస్తూ.. శివసేన కార్యకర్తలు చత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌కు భారీగా తరలి రాగా.. కంగనాకు మద్దతుగా కర్ణిసేన, ఆర్‌పీఐ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఎయిర్‌ పోర్టుకు తరలివచ్చారు. ఇరు వర్గాలు నినాదాలతో హోరెత్తించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఎయిర్‌ పోర్టు నుంచి కంగనా ప్రత్యేక గేట్‌ నుంచి బయటకు వెళ్లడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కంగనాకు ప్రాణహాని ఉందని.. కేంద్రం ఆమెకు వై కేటగిరి భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే.

ఇక శివసేన కీలక నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ ముంబైకి తిరిగి రావద్దంటూ బెదిరించారని కంగనా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై బీజేపీ నాయకుడు ప్రవేష్ సాహిబ్ సింగ్ స్పందిస్తూ.. ముంబై ఎవరి సొత్తు కాదు. అక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నించాడు. అలాగే కంగనా క్షమాపణ చెప్పాలని శివసేన డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పని పక్షంలో ముంబైలో అడుగుపెట్టవద్దని శివసేన పార్టీ నేతలు కార్యకర్తలు కంగనాను హెచ్చరించారు. అయితే దానికి కంగనా .."ముంబైకి తిరిగి రాకూడదని చాలా మంది నన్ను బెదిరిస్తున్నారు, కాబట్టి నేను వచ్చే వారం సెప్టెంబర్ 9 న ముంబైకి వెళ్లాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. నేను ముంబై విమానాశ్రయంలో దిగే సమయాన్ని పోస్ట్ చేస్తాను, ఎవరికైనా దమ్ముంటే ఆపుకోండి'' అంటూ కంగనా ఓపెన్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

ఈ రోజు ముంబైలోని కంగనా కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూల్చివేశారు. దీంతో ముంబైని ఆమె మరోసారి పీఓకేతో పోల్చారు. కంగనా రాకతో ఆమె నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక కంగనా కార్యాలయం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తన ఇంటిలో ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టలేదని, కోవిడ్‌ కారణంగా సెప్టెంబర్‌ 30 వరకూ కూల్చివేతలను ప్రభుత్వం నిషేధించిందని కంగనా ట్వీట్‌ చేశారు. ఫాసిజం ఎలా ఉంటుందో బాలీవుడ్‌ ఇప్పుడు గమనిస్తోందని కంగనా బీఎంసీ చర్యపై మండిపడ్డారు.

Next Story