అంచనా రూ.85 వేల కోట్లు.. కానీ ఇప్పటికే రూ.లక్ష కోట్లు దాటింది..!

By అంజి  Published on  8 Dec 2019 5:38 AM GMT
అంచనా రూ.85 వేల కోట్లు.. కానీ ఇప్పటికే రూ.లక్ష కోట్లు దాటింది..!

ముఖ్యాంశాలు

  • తాజాగా మరో రూ.25 కోట్లు పెరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం
  • మూడు టీఎంసీల నీటిని తరలించేలా నిర్మాణాలు
  • డిసెంబర్‌ చివరి వారంలో టెండ్లర్లను పిలిచే అవకాశం

జయశంకర్‌ భూపాలపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. నిర్మాణాల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం ఇప్పటికే రూ.1.14 కోట్లకు చేరుకుంది. తాజాగా మరో రూ.25 వేల కోట్లు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. మూడో టీఎంసీ నీటిని తరలించడం కోసం రూ.25 వేల కోట్లతో టెండర్లను పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిసెంబర్‌ చివరి వారంలో టెండర్లను పిలిచేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రూ.85 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు.

ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ప్రతిపాదించిన ప్రాణహిత-చెవేళ్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రీడిజైన్‌ చేయించింది. మూడు బ్యారేజీలు, 19 పంప్‌హౌస్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. మొదట రెండు టీఎంసీల నీటిని మాత్రమే తరలించేలా పనులు జరిగాయి. నీటి తరలింపుతో మొదట శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును నింపాలని సీఎం కేసీఆర్‌ అనుకున్నారు. అలాగే సాగర్‌ ఆయకట్టుకు, డిండి ప్రాజెక్టుకు నీరు అందించేందుకు సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారు.

మూడు టీఎంసీల నీటి తరలింపు..

ఈ నేపథ్యంలో మూడు టీఎంసీల నీరు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడో టీఎంసీ నీటిని తరలించడం కోసం కాల్వలు, పైప్ లైన్లు, ప్రత్యేక పంప్ హౌస్‌లు నిర్మించనున్నారు. మేడిగడ్డ నుంచి అన్నారం, ఎల్లంపల్లి, సుందిళ్ల వరకు మూడు టీఎంసీల నీరును తరలించేలా నిర్మాణాలు చేపట్టారు. రెండు టీఎంసీల నీరు తరలించేలా మాత్రమే మోటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పడు అదనంగా మోటర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందు కోసం మరో రూ.4 వేల అంచనా వ్యయం అవుతుందని అధికారులు చెబుతున్నారు.

ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు రోజుకు 3 టీఎంసీల నీరును తరలించేలా నిర్మాణాలు చేశారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు 2 టీఎంసీలు మాత్రమే తరలించేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాగా మిడ్‌ మానేరు నుంచి మల్లన్నసాగర్‌కు రోజుకు ఒక టీఎంసీ నీటిని మాత్రమే తరలించాలి. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు మరో టీఎంసీ నీటిని తరలించేందుకు వీలుగా త్వరలో నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు.

నీటిని తరలించే క్రమంలో ఇప్పటికే రూ.14 కోట్ల విలువైన పనులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరు వరకు అదనంగా టీఎంసీ నీటి తరలింపు కోసం పనుల కోసం రూ.11 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నిర్మాణాల కోసం మొత్తం రూ.25 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు లింక్‌లకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధమైతే.. వెంటనే నీటి తరలింపు పనుల కోసం టెండర్లను పిలవాలని చూస్తున్నారు.

రాజకీయ లబ్ధి కోసం కాకుండా.. ప్రజల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని అప్పటి నీరుపారుదల శాఖ మంత్రి హారీష్‌ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సశ్యశామలం అవుతుందన్నారు. అసరమైతే కృష్ణ పరివాహక ప్రాంతానికి కూడా నీటిని తరలించేలా మూడో పంప్‌పును బిగించేలా ఏర్పాట్లు చేశామని.. కాళేశ్వరం పర్యటన సందర్భంలో హారీశ్‌ రావు అన్నారు.

Next Story