ఆయనొక విశ్వయోగి..ఆయనో తపస్వీ..ఆ నవ్వు చైతన్య దీపం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2019 6:25 AM GMT
ఆయనొక విశ్వయోగి..ఆయనో తపస్వీ..ఆ నవ్వు చైతన్య దీపం

కలలు కలలుగా మిగిలిపోకూడదు..మన ఆలోచనలు నిత్యం కెరటంలా ఎగరాలి.మనలోని పట్టుదల పిడికిలి బిగించి ఉండాలి..అనుకున్నామంటే సాధించే వరకు నిద్ర పోకూడదు..చిన్న దీపం కఠిక చీకటిని పారద్రోలుతుంది..మనలో వెలిగిన చిన్న ఆలోచన దేశంలో వెలుగులు నింపుతుంది. నేడు అబ్దుల్ కలాం పుట్టిన రోజు ఆ మహానుభావుడ్ని, మిస్సైల్ మేన్‌ను గుర్తు చేసుకుంటూ న్యూస్‌ మీటర్ ప్రత్యేక వ్యాసం

"కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి" ప్రతి భారతీయుడి చెవుల్లో ఈ మాటలు ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటాయి. ఒకసారి ఆయన ఉపన్యాసం ఇచ్చి..కొంత మందిని ప్రశ్నలు అడగమన్నారు ..అందులో ఒకరు అడిగిన ప్రశ్న..కలాం చెప్పిన సమాధానం మీ ముందు ఉంచుతాను. సార్‌..సక్సెస్‌ అంటే ఏంటీ..?. అబ్దుల్ కలాం ప్రశ్న అడిగిన వ్యక్తిని ఒకసారి ఆప్యాయంగా చూసి..చిరు నవ్వు నవ్వి..ఏమాత్రం తడుముకోకుండా.."సక్సెస్‌ అంటే నీ సంతకం ఆటో గ్రాఫ్‌ గా మారడమే"అని చెప్పారు.

ఎక్కడో దేశానికి చివరి అంచున ఉన్న రామేశ్వరం దగ్గర రామనాథపురం అనే చిన్న గ్రామంలో అక్టోబర్‌ 15, 1931న అబ్దుల్ కలాం జన్మించారు. చిన్నప్పటి నుంచే రామేశ్వరం బీచ్‌ లో ఎగురుతున్న పక్షులను చూసేవాడు. వాటికి ఎగిరే శక్తి ఎలా వచ్చింది..? ఎలా ఎగురుతున్నాయి? అనే ప్రశ్నలు చిన్నారి కలం మెదడును తొలిచేవి. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే క్రమంలోనే ఆయన మిస్సైల్ మేన్ అయ్యారు. ఎన్నో కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోశారు.

భారత రక్షణ వ్యవస్థకు ప్రాణం పోశాడు. అణు పరీక్షలు నిర్వహించాలి..భారత్ శక్తిమంతమైన దేశంగా ముందుకు వెళ్లాలని కలలు కని సాధించాడు. పెద్ద పెద్ద మిస్సైల్లే కాదు.. కొన్ని కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఆకాష్, ఆస్త్ర, నాగ్‌ మిస్సైల్లకు ప్రాణం పోశాడు. ఇప్పుడు ఇస్రో ఇన్ని విజయాలు సాధిస్తుందంటే అది కలాం ప్రణాళికలు, కష్టాల్లో భాగమే. భారత దేశానికి సంబంధించిన వ్యూహాత్మక రంగాల్లోనే కాదు...భారత దేశ సంక్షేమ, అభివృద్ధిలో కూడా అబ్దుల్ కలాం ఆలోచనలు ఉన్నాయి.

ఆయన ఉద్యోగరీత్యా ఎక్కడకు వెళ్లినా ఉద్యోగులతో, వారి కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోయే వారు. ఒకసారి..ఇస్రో అతి పెద్ద రాకెట్‌ను ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు. ఇస్రోలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే ఓ శాస్త్రవేత్తకు ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసింది ఆయన సతీమణి. వీకెండ్ కదా పిల్లలు పార్క్‌కు తీసుకెళ్లమంటున్నారు. మీరు వెంటనే రావాలని. కాని..ఇక్కడ దేశం గర్వపడే పనిలో బిజీగా ఉన్నారు భర్త. అటే భార్య మాట కాదనలేడు. ఇటూ .. వృత్తిని వదిలి వెళ్లలేడు. ఫోన్‌లో ఆ శాస్త్రవేత్త భార్యను మతిమిలాడటం విన్నాడు కలాం. అంతే.. ఆ శాస్త్రవేత్త క్వార్టర్స్‌కు వెళ్లి..ఆ పిల్లలను సరదాగా పార్క్‌లో తిప్పుకొచ్చి ఇంట్లో వదిలారు. అంతటి మానవతాహృదయుడు అబ్దుల్ కలాం. తన ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగా భావించే గొప్ప వ్యక్తిత్వం అబ్దుల్ కలాంది.

గుజరాత్‌లో మత కల్లోహాలతో ఎన్డీఏ ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు వచ్చింది. ముస్లింలు బీజేపీకి బాగా వ్యతిరేకమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఏం చేయాలి. ముస్లింను రాష్ట్రపతిని చేయాలని భావించారు. ఆయనకు అబ్దుల్ కలాం కనిపించారు. ఉద్యోగం విరమించి పాఠాలు చెప్పుకుని జీవితం వెళ్లదీద్దామనుకున్న కలాం రాష్ట్రపతి భవన్‌లోకి అడుగు పెట్టారు. ఎలా అంటే..నాలుగు జతల బట్టలు, ఒక వీణాతో రైసినా హిల్స్‌పై కాలు పెట్టారు కలాం. రాష్ట్రపతి గా కలాం అనేక సార్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటిరెండు సార్లు కేంద్రం అభిప్రాయాలతో విభేదించిన సందర్భాలున్నాయి.

రాష్ట్రపతిగా కొన్ని లక్షల మంది చిన్నారులను, విద్యార్దులను ఆయన కలిసి భవిష్యత్‌ భారత్‌పై కలలు కనేలా చేశారు. వారి బాధ్యతలు గుర్తెరిగేలా ప్రసంగిచారు. జులై 25, 2002 నుంచి జులై 25,2007 వరకు ఆయన రాష్ట్రపతిగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు.

అబ్దుల్ కలాం ఆలోచనలు దేశం కోసం వెలిగాయి. ఆయన అడుగులు భవిష్యత్‌ భారత్ వైపు పడ్డాయి .కలాం ఒక యుక్తి. ఆయన రగిలించిన చైతన్య దీపాలు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ దాకా వెలుగుతూనే ఉన్నాయి. ది గ్రేట్ ఇండియన్, భారత మాత ముద్దు బిడ్డ అబ్దుల్ కలాం పుట్టిన రోజు నేడు.





వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

Next Story