కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని బులవారి పల్లి మండలం పరిధిలోలోని చిన్న ఓరంపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లంపేట మండలం చెన్నగారిపల్లె గ్రామానికి చెందిన నాగినేని పాపయ్య (40), తల్లి సుబ్బమ్మ (65), కుమారుడు హరిచరణ్‌ (10)లు కువైట్‌ నుంచి చెన్నైకి వచ్చారు.

కాగా, అక్కడినుంచి సొంతూరైన పుల్లంపేటకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ఓరంపాడు రహదారిపై ప్రయాణిస్తున్న ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.