మొన్న కేసీఆర్ కలిసిన చిన్నజీయర్‌ను.. నేడు ఆర్టీసీ కార్మికులు కలిశారు.. ఎందుకు.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2019 2:04 PM ISTహైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నాలుగు వారాలకు చేరుకుంది. అయితే కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక్క మెట్టు కూడా దిగిరావడం లేదు. ఆర్టీసీతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. తమ డిమాండ్లను ఒప్పించేందుకు కార్మికులు ఇతర మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.
కోర్టులో కేసులు, అఖిలపక్ష సమావేశాలు, రాష్ట్ర బంద్‌లు నిర్వహించిన ప్రభుత్వం మాత్రం కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదు. భూగోళం ఉన్నంతవరకు ఆర్టీసీ సమస్యకు పరిష్కారం లభించదన్నారు సీఎం కేసీఆర్. అదే సమయంలో ఉద్యోగం చేసుకోవాలనుకునే వారు నేరుగా డిపోలోకి వెళ్లి విధుల్లో చేరవచ్చని సూచించారు.
తమ డిమాండ్లను నెరవేరే వరకు సమ్మెను ఆపేదిలేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ యూనియన్ల నేతలు త్రిదండి చిన్నజీయర్ స్వామిని కలిశారు. ముచ్చితంల్ ఆశ్రమంలో చిన్నజీయర్ స్వామిని కలిసిన కార్మికులు.. తమ సమ్మెకు న్యాయం జరిగేలా చూడాలని వారికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను సీఎం కేసీఆర్‌కు వివరించాలని అభ్యర్థించారు.
కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు చెల్లించే స్థితిలో తాములేమని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. హైకోర్టులో కేసు విచారణ వాయిదా పడింది. ఇదే సమయంలో ప్రయాణికుల ఇబ్బందులు వర్ణణాతీతం.