వెటర్నరీ డాక్టర్ దిశపై ఘోర అత్యాచారం, ఆ తరువాత అత్యంత కిరాతకంగా హత్య. నిన్న శంషాబాద్‌లో బాగా కాలిపోయిన మృతదేహం. వరంగల్‌లో ఆర్నెల్ల పసిగుడ్డుపై సైకో “హత్యాచారం”, మంగళవారం బీహార్ లోని బక్సర్‌లో సామూహిక రేప్ చేసి ఒక ఇరవైఏళ్ల మహిళను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిన సంఘటన… అది చాలదన్నదు చనిపోయిన మహిళను పెట్రోలు పోసి దహనం చేయడం…. ఇలా మహిళలపై అత్యాచారాలు ప్రతి రోజూ పత్రికల పతాక శీర్షికలకెక్కుతున్నాయి. దేశంలో ఏదో ఒక మూలలో ఏదో ఒక మహిళ అత్యాచారానికి గురవుతూనే ఉంది. లైంగిక వేధింపులు సర్వసాధారణమయ్యాయి.

ఇలా అనునిత్యం పెరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో అమెరికా, యూకేలు భారత్ లో పర్యటిస్తున్న తన దేశ పౌరులకు, ముఖ్యంగా మహిళలకు హెచ్చరికలు జారీ చేశాయి. “రేప్, లైంగిక దాడులను తట్టుకోవడం” అన్న పేరిట ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. నిజానికి ఈ హెచ్చరికలు దిశ సంఘటనకు ముందే జారీ అయ్యాయి. 2016 లోనే అమెరికా ప్రభుత్వం మహిళా భద్రత విషయంలో భారత్ ను లెవెల్ 2 కేటగరీలో ఉంచింది. అమెరికన్ పర్యాటకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. భారత ప్రభుత్వమే మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని చెబుతున్నట్టు కూడా ఈ హెచ్చరికలో పేర్కొన్నారు. రేప్ కి గురైన బ్రిటిష్ మహిళలు ఎఫ్ ఐ ఆర్ రిపోర్టును తప్పనిసరిగా తీసుకోవాలని, అది స్థానిక భాషలో ఉంటే దానిని చదివి అర్థం తప్పనిసరిగా చెప్పించుకోవాలసి సూచించింది. తాము మహిళా పోలీసుతోనే మాట్లాడతామని అధికారులకు ఖచ్చితంగా చెప్పాలని కూడా ఈ హెచ్చరిక పత్రంలో సూచించారు.

బ్రిటన్ హెచ్చరిక దిశ దారుణ హత్యకురెండు రోజుల ముందు జారీ అయింది. ప్రమాదంలో ఉన్నప్పుడు 100 కి డయల్ చేయాలని, కేవలం మహిళా పోలీసులతోనే తాను మాట్లాడతానని గట్టిగా చెప్పాలని ఇందులో సూచించడం జరిగింది. ఒక్క 2017 లోనే రేప్ చేసి హత్య చేసిన సంఘటనలు 223 నమోదయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో పేర్కొంది. ఈ గణాంకాల ప్రకారం దేశంలో 2017 లో మొత్తం 32,559 రేప్‌లు జరిగాయి. మహిళలపై దాడులు చేసిన 3.6 లక్షల మందిపై కేసులు నమోదయ్యాయి. 2015లో 3.3 లక్షల కేసులే నమోదయ్యాయి. అంటే రెండేళ్లలో 30 వేల కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్న మాట.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.