అత్యాచారం కేసుల్లో కనుచూపు మేరలో కానరాని న్యాయం..

By Newsmeter.Network  Published on  8 Dec 2019 2:44 PM GMT
అత్యాచారం కేసుల్లో కనుచూపు మేరలో కానరాని న్యాయం..

· వేల సంఖ్యలో పేరుకుపోయిన అత్యాచారం కేసులు

· పరిస్థితికి అద్దం పడుతున్న ఎన్.సి.ఆర్.బి నివేదిక

· విచారణలో తీవ్రస్థాయిలో జరుగుతున్న జాప్యం

· న్యాయంకోసం 41129 మంది అత్యాచారం బాధితుల పడిగాపులు

హైదరాబాద్ : నిర్భయ కేసులో ఇంకా న్యాయం జరగనే లేదు. దిశ కేసులో మాత్రం నిందితులు ఎన్ కౌంటర్ లో హతులయ్యారు. న్యాయం జరగడంలో ఆలస్యమే కొత్త నేరాలకు ఊతం ఇస్తోందని సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఆలస్యం జరిగినకొద్దీ కొన్ని కేసుల్లో న్యాయం అందే అవకాశం కూడా ఉండకపోవచ్చంటున్నారు.

తెలంగాణ పోలీసుల దూకుడు

జస్టిస్ ఫర్ దిశ కేసులో కీలక మలుపులు దేశాన్ని మొత్తం కుదిపేశాయి. నిందితులు నలుగురూ పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఘటనా స్థలంలోనే పోలీసులపై దాడి చేసి కాల్పుల్లో మరణించారు. ఒక రకంగా తెలంగాణ పోలీసులు కొంత దూకుడుగా వ్యవహరించినా, దిశ కేసులో సరైన న్యాయం జరిగిందని దేశవ్యాప్తంగా కోట్లమంది భావిస్తున్నారు. అదే సమయంలో నిర్భయ కేసులో మాత్రం ఏడేళ్లు గడిచినా ఇంత వరకూ న్యాయం జరగలేదు. దేశంలో ఇంతవరకూ అత్యాచారం బాధితులకు సత్వర న్యాయం చేసే వ్యవస్థ లేకపోవడం అత్యంత విచారకరమని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో

2017లో విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో జాతీయ నేర నివేదిక ప్రకారం దేశంలో నమోదైన 46,984 అత్యాచారం కేసుల్లో కేవలం 5,855 కేసుల్లో మాత్రం నిందితులకు శిక్ష పడింది. 86.6% కేసుల్లో చార్జ్ షీట్ దాఖలైతే కేవలం శిక్ష ఖరారైన కేసుల శాతం మాత్రం 32.2.

తెలంగాణ హై కోర్టు న్యాయవాది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు విష్ణువర్థన్ చెబుతున్న వివరాల ప్రకారం ప్రత్యేక న్యాయస్థానాలు కూడా విచారణ పూర్తి చేయడానికి హీనపక్షం మూడు నుంచి ఆరు నెలల కాలం తీసుకుంటాయని తెలుస్తోంది.

మొదటి హియరింగ్

కేసు అడ్మిట్ చేసిన రోజునుంచి క్రమంతప్పకుండా హియరింగ్ లు జరుగుతూనే ఉంటాయి. ఒక వేళ నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్తే మొట్టమొదటి హియరింగ్ లోనే కేసు విచారణ పూర్తయ్యే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

నిజానికి తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని దాన్ని ఆత్మ రక్షణ చర్యకు ప్రతీకగా చూడొచ్చని న్యాయనిపుణులు భావిస్తున్నారు. కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అధికారం పోలీసులకు లేదని చెబుతున్నారు.

కేవలం వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం మాత్రమే తెలంగాణ పోలీసుల చర్యను సమర్థించడం సాధ్యమవుతుందని, చట్టపరంగా అయితే అలా సాధ్యంకాదని అంటున్నారు. విచారణను వేగవంతం చేయాలని మాత్రం.. పోలీసులు న్యాయస్థానాన్ని కోరడానికి వీలవుతుందని చెబుతున్నారు.

ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీలు

భారత దేశంలో ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీలు సరైన, సముచితమైన కారణం లేకుండానే అత్యాచారం కేసుల్లో విచారణను సాగదీస్తారని, పోలీసులు వెంటనే చార్జ్ షీట్ ను సమర్పిస్తే న్యాయస్థానం వీలైనంత త్వరగా విచారణను ముగిస్తుందని సీనియర్ న్యాయవాది సి.మల్లేష్ రావ్ అంటున్నారు.

ఇలా చేయడంవల్ల సాక్ష్యుల నుంచి సరైన సాక్ష్యాన్ని తీసుకోవడానిక అవకాశం ఉంటుందని, ఆలస్యం చేసినకొద్దీ పలచబడిపోతుందని, సాక్ష్యాలను తారుమారు చేసే ఆస్కారం, పూర్తిగా కనుమరుగు చేసే ఆస్కారం కూడా ఉంటుందని చెబుతున్నారాయన. ఈ కారణాల రీత్యా బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు సన్నగిల్లుతాయంటున్నారు.

సాక్ష్యాధారాలు లేకపోవడంవల్ల

ఎన్సిఆర్బి లెక్కల ప్రకారం 2017 చివరికి 14,406 అత్యాచారం కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ఇంకా పెండిగ్ లోనే ఉంది దేశంలో. 1,012 కేసులు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంవల్ల కొట్టివేయబడ్డాయి. 30 కేసులు విచారణ సమయంలోనే నీరుగారిపోయాయి.

నేరం రుజువైన తర్వాతకూడా శిక్ష వేసేందుకూ తీవ్రస్థాయిలో ఇలాంటి కేసుల్లో జాప్యం జరుగుతోందని మల్లేశ్వరరావు చెబుతున్నారు. నిర్భయ కేసును దీనికి ఆయన ఉదాహరణగా చెబుతున్నారు. అప్పీళ్లు, ట్రయళ్ల పేరుతో నిందితులు హాయిగా జీవిస్తున్నారని, బాధితురాలికి, ఆమె కుటుంబానికీ న్యాయం ఇంకా జరగలేదని అన్నారు.

రాష్ట్రపతి - క్షమాభిక్ష

సుప్రీంకోర్టు ఒక అప్పీలుపై నిర్ణయం తీసుకోవడానికి ఏళ్ల సమయం తీసుకుంటుందని ఆయన చెబుతున్నారు. వీలైనంత వేగంగా విచారణ జరిగితేనే సంపూర్ణ న్యాయం జరగడానికి ఆస్కారముంటుందంటున్నారు. భారత రాష్ట్రపతికూడా క్షమాభిక్ష విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగితే మరింత త్వరగా బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

పోలీసులు కేవలం 24 గంటల్లో చార్జ్ షీట్ దాఖలు చేయడం న్యాయస్థానాలు పది రోజుల్లోనే విచారణ పూర్తి చేయడం జరిగిన సందర్భాలుకూడా కొన్ని ఉన్నాయని, ఆ కేసులను, ఆ సందర్భాలను ఉదాహరణగా తీసుకుని సత్వర న్యాయం జరిగేందుకు దోహదపడే రీతిలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, న్యాయస్థానాలు విచారణను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.

జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్

సిబిఐ కేసుల్లో అయితే నేర నిర్ధారణ కేవలం రెండు మూడు శాతంకంటే ఎక్కువ స్థాయిలో ఉండదని, కొన్ని కేసుల్లో జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేయమని కోరినప్పుడు పూర్తి స్థాయిలో కాల హరణం జరుగుతుందని చెబుతున్నారు. వీలైనంత త్వరగా న్యాయం చేయాల్సిన వ్యవస్థలే వీలైనంత ఆలస్యం జరగడానికి దోహదపడుతున్నాయన్న అభిప్రాయాన్ని ఈ సీనియర్ అడ్వకేట్ వ్యక్తం చేస్తున్నారు.

Next Story