స‌మ్మెకు దిగిన డాక్ట‌ర్లు.. గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త‌త‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jun 2020 11:55 AM GMT
స‌మ్మెకు దిగిన డాక్ట‌ర్లు.. గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త‌త‌

గాంధీలో కరోనా పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తోన్న జూనియర్ డాక్టర్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. డాక్ట‌ర్ల‌పై దాడులు చేయడాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. ఈ మేర‌కు గాంధీ ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. డాక్టర్ల నిరసన ప్రదర్శన కొనసాగించారు. మంగ‌ళ‌వారం రాత్రి నుండి మొద‌లైన నిర‌స‌న‌ బుధవారం మధ్యాహ్నానికి మరింత తీవ్రతరం చేశారు.

తాజాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌ ఓ కరోనా వైరస్ పేషెంట్ బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడులు చేశారు. కరోనా బారిన పడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న రోగి ఒకరు మృతి చెందారు. దీనికి ప్రధాన కారణం.. డాక్టర్ల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ పేషెంట్ బంధువులు ఆగ్రహంతో దాడికి దిగారు. వార్డులోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి.. అడ్డు వచ్చిన ఓ జూనియర్ డాక్టర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యుడు స్వల్పంగా గాయపడ్డాడు.

దీంతో.. గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు మంగళవారం రాత్రి సమ్మెకు దిగారు. తమ నిరసన ప్రదర్శనలను బుధవారం కూడా కొనసాగిస్తున్నారు. కేసీఆర్ రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో.. సికింద్రాబాద్ - ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రధాన మార్గంపై వందలాది మంది జూనియర్ డాక్టర్లు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద‌ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే.. జూనియర్ డాక్టర్స్ ఆందోళన విరమించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ప్రతినిధులను సచివాలయానికి రావాలని కోరారు.

Next Story