లారెన్స్ తమ్ముడూ.. ఆ ఏసీపీ నా జీవితాన్ని నాశనం చేశారు
By తోట వంశీ కుమార్ Published on 7 March 2020 3:47 PM ISTసినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తరుచుగా వినిపిస్తోంది. దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ (విన్నీ) తనను వేధిస్తున్నాడంటూ ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఓ ప్రముఖ ఛానల్‌ను ఆశ్రయింది. లారెన్స్ తమ్ముడు విన్నీ నుంచి తనకు ప్రాణహాణి ఉందని షాకింగ్ కామెంట్లు చేసింది.
లారెన్స్ తమ్ముడు వినోద్.. ప్రేమను తిరస్కరించినందుకు వేధింపులకు గురిచేస్తున్నాడంటూ.. వరంగల్‌కు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ కమ్ సైడ్ డాన్సర్ మీడియాకెక్కడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వేధింపులు తట్టుకోలేక వెస్ట్‌మారేడ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని.. సీఐతో కుమ్మకై తననే జైలుకు పంపారని ఆరోపించింది. జైలు నుంచి బయటకు వచ్చినా కూడా వేధింపులు ఆగలేదని చెప్పింది. వినోద్, అతని అనుచరులు ఎక్కడికి వెళ్లినా తనను వెంబడిస్తూ చంపేందుకు కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. వారి చీకటి బాగోతం అంతా తెలుసునని అందుకే తనని చంపాలని చూస్తున్నారని చెప్పింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కల్పించుకుని తనకు రక్షణ కల్పించాలని కోరుతోంది ఆ యువతి.
ఏసీపీ తనపై బ్రోతల్ కేసు పెట్టి 21 రోజులు జైలుకు పంపారని, విచారణ పేరుతో లాడ్జిలకు రమ్మని నీచంగా మాట్లాడేవారంటూ వాపోయింది సదరు యువతి. స్టేషన్‌కి పిలిచి తెల్లకాగితంపై బలవంతంగా సంతకం చేయించుకుని తనపై బ్రోతల్ కేసు పెట్టారని, గాంధీ హాస్పటల్‌కి తీసుకుని వెళ్లి ఏవేవో తప్పుడు పరీక్షలు జరిపించి జైలుకు పంపారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇన్ని చేసినా తనవైపును పోరాడటానికి ఎవరూ లేకపోవడంతో రహస్యంగా తలదాచుకుంటున్నానంది. లారెన్స్ తమ్ముడి నుండి వేధింపులు ఆగలేదని ఎక్కడకు వెళ్లినా వెంటాడి వేధిస్తున్నారని తనకు ప్రాణ రక్షణ కల్పించాలని కేసీఆర్‌ను వేడుకుంది.
ఆరోపణల్లో వాస్తవం లేదు..
యువతి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. 2014-15లో మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ సీఐగా పనిచేస్తున్న సమయంలో ఈ యువతి స్టేషన్‌కు వచ్చింది. సినీ కొరియోగ్రాఫర్ లారెన్స్‌తో యువతికి వివాదం ఉంది. ఇందులో భాగంగా మారేడ్‌పల్లిలో ఓ కేసు విషయంలో స్టేషన్‌కు వచ్చింది విచారణ జరిపాం. ఆమె ఆరోపణలన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవేనని వివరణ ఇచ్చారు సదరు ఏసీపీ.