బలవంతయ్య.. ఏంటయ్యా ఈ లీలలు..!
By అంజి Published on 11 Jan 2020 10:34 AM GMTహైదరాబాద్: ఇన్స్పెక్టర్ బలవంతయ్య అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బలవంతయ్య ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. లంచం తీసుకున్న కేసులో బలవంతయ్యను అధికారులు విచారిస్తున్నారు. ఇన్స్పెక్టర్ బలవంతయ్య ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, మిత్రుల ఇళ్లలోను ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బలవంతయ్య ఇన్స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. లంచం తీసుకున్న ఆరోపణలపై బలవంతయ్యను అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్‌లోని బలవంతయ్య ఇళ్లు, అతని సోదరి, సోదరుడు ఇళ్లలో ఏసీబీ దాడులు నిర్వహించింది.
రెండున్నర నెలలుగా జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్‌గాఆ పని చేస్తున్న బలవంతయ్య.. జూబ్లీహిల్స్‌లో పలు సెటిల్‌మెంట్‌లు, బెదిరింపులకు పాల్పడ్డాడు. వంశీకృష్ణ అనే నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు ఇన్స్పెక్టర్ బలవంతయ్య ఆదేశాల మేరకు ఎస్సై రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ స్పా సెంటర్ నిర్వహకులు తమకు వంశీకృష్ణ నుంచి రావాల్సిన డబ్బు విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వంశీకృష్ణపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు డిసెంబర్ 31న అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడికి బెయిల్ ఇప్పిస్తానని, రాజీ కూదుర్చుతానని.. ఇందుకుగాను రూ.లక్ష ఇవ్వాలని బలవంతయ్య డిమాండ్ చేశాడు.
రూ.50 వేలు, రెండు మందు బాటిళ్లు ఇస్తానని వంశీకృష్ణ బలవంతయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే రోజున వంశీకృష్ణ స్టేషన్ నుంచి విడదలయ్యాడు. అనంతరం వంశీకృష్ణ ఈ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో వంశీకృష్ణ దగ్గరి నుంచి ఎస్సై సుధీర్ రెడ్డి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇప్పటికే ఇన్స్పెక్టర్ బలవంతయ్య, ఎస్‌సై సుధీర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు. పోలీస్ శాఖలో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అంజనీ కుమార్ సృష్టం చేశారు. పోలీసులు లంచం డిమాండ్ చేస్తే 9490616555 ఫోన్ నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు.