తాకట్టులో జూబ్లీ బస్ స్టేషన్..!
By సత్య ప్రియ Published on 17 Oct 2019 8:29 AM GMTతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిలువునా అప్పుల్లో మునిగిపోయింది. అమూల్యమైన ఆర్టీసి ఆస్తులు తాకట్టులో ఉన్నాయి. ఆదాయానికి, ఖర్చులకీ సమత్వం లేకపోవడం, రాయితీ బకాయిలను ప్రభుత్వం సమయానికి విడుదల చేయకపోవడం, అంచనాలకు మించి డీజిల్ ధరలు పెరగడం వంటి సమస్యల వల్ల టిఎస్ ఆర్టీసీ తమ రోజువారీ కార్యకలాపాలకు సైతం అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ అప్పుల కోసం, ఈ సంస్థ తమ ఆస్తుల్ని తాకట్టు పెడుతోంది.
జూబ్లీబస్ స్టేషన్ ను తనఖా పెట్టి రూ.650 కోట్లు అప్పు తీసుకుంది. ఉప్పల్ వర్క్ షాప్ ను రూ.175 కోట్లకూ, బర్కత్ పురా బస్ డిపో నురూ. 45 కోట్లకూ, హయత్ నగర్ డిపోలను రూ.100 కోట్లకూ, కరీం నగర్ వర్క్ షాప్ నురూ. 450 కోట్ల కూ తాకట్టు పెట్టింది టీఎస్ఆర్‌టీసీ.
ఈ ఏడాది జూన్ వరకూ రూ. 2,445 కోట్ల అప్పులున్నట్టు సమాచారం. ఇందులో రూ.1,595 కోట్ల నేరుగా బ్యాంకుల నుంచి తీసుకున్నవి, సుమారురూ. 850 కోట్ల ప్రభుత్వ పూచీకత్తు పై పొందినవి. అంతేకాకుండా, కార్మికుల పీఎఫ్ వంటి ఇతర బాకీలు మరో రూ.1400 కోట్లు. ఈ అప్పు తాలూకా వడ్డీ రోజుకు రూ. 80 లక్షలు, ఏడాదికి దాదాపు రూ.290 కోట్లు.
"ప్రభుత్వ రాయితీల కింద చెల్లించాల్సినరూ. 700 కోట్లు ఉంటుంది. ఈ బాకీ లో కొద్దికొద్ది గా చెల్లించినా ఆర్టీసీ మీద అంత భారం ఉండదు. ఈ అప్పులని సాకుగా చూపించి విలువైన ఆర్టీసి స్థలాలను ప్రభుత్వం తమవారికి లీజ్ కి ఇచ్చేస్తోంది" అంటున్నారు జేఏసి నేతలు
ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండగానే సంస్థ ఆస్తులను కొల్లగొట్టేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. పట్టపగలే ఆర్టీసీ ఆస్తులు దోచుకుంటున్నారన్నారు. ఆర్టీసీకి చెందిన రూ.80 వేల కోట్ల ఆస్తులను అధికార పార్టీకి చెందిన వారికి లీజులు, అద్దెల పేరిట పందేరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళసైకి ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమ్మె, ఆస్తుల లీజుపై లక్ష్మణ్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసింది.
గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన తర్వాత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని విలువైన ఆర్టీసీ స్థలాలతో పాటు ఆర్మూర్, వరంగల్, కరీంనగర్ తదితర 115 ప్రధాన కూడళ్లలోని రూ.80 వేల కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలను లీజుల పేరిట గులాబీ దండుకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.