ఏప్రిల్‌లో గ్రూప్ 1 మెయిన్స్‌.. ఈ వారంలోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు..!

TSPSC ready to release Preliminary Exam results this week.టీఎస్పీఎసీ గ్రూప్ 1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2023 5:08 AM GMT
ఏప్రిల్‌లో గ్రూప్ 1 మెయిన్స్‌.. ఈ వారంలోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు..!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎసీ) గ్రూప్ 1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాల‌ను మ‌రో నాలుగైదు రోజుల్లో వెల్ల‌డించేందుకు స‌న్నాహాకాలు చేస్తోంది. గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షను ఏప్రిల్ నెలలో నిర్వహించాలని బావిస్తోంది. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాల‌తో పాటే మెయిన్స్ ప‌రీక్షల షెడ్యూల్‌ను విడుద‌ల చేయాల‌ని యోచిస్తోంది. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు వెలువ‌డిన త‌రువాత మెయిన్స్ ప‌రీక్ష‌కు అభ్య‌ర్థులు ప్రిపేర్ అయ్యేందుకు మూడు నెల‌ల సమ‌యం ఇవ్వ‌నున్నారు.

ఇప్పటికే ఓఎంఆర్‌ షీట్ల మూల్యాంకనాన్ని టీఎస్పీఎసీ పూర్తి చేసింది. ఫ‌లితాల ప్ర‌క‌ట‌న‌లో ఎలాంటి పొర‌బాట్ల‌కు ఆస్కారం లేకుండా జాగ్ర‌త్త తీసుకుంటోంది. ఒక‌టికి రెండు సార్లు అన్ని వివ‌రాల‌ను స‌రిచూస్తోంది. మ‌ల్టీజోన్లు, రిజ‌ర్వుడు వ‌ర్గాల వారీగా జాబితాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తోంది. శుక్ర లేదా శ‌నివారం ఫ‌లితాలు వెలువ‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఏమైన ఇబ్బందులు ఎదురైతే మాత్రం సోమ‌వారం ఫ‌లితాలను వెల్ల‌డించ‌నుంది.

అక్టోబర్ 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 1:50 నిష్పత్తిలో అంటే 25,150 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు ఎంపిక చేయ‌నున్నారు. ఇందులో ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ చేయ‌నున్నారు. గ్రూప్ 1 స‌ర్వీసుల కింద 503 ఖాళీల భ‌ర్తీకి టీఎస్పీఎసీ నోటీఫికేష‌న్ జారీ చేసింది. వాస్త‌వానికి మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించాల‌ని బావించింది. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లు ఆల‌స్యం కావ‌డంతో మెయిన్స్ తేదీల‌పై సందిగ్ధత నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్‌లో మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని బావిస్తోంది.

Next Story