హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. మొత్తం 22,033 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. సంవత్సరంలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో అధికారులు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ ఆదేశాల మేరకు త్వరలోనే నియామక ప్రకటనలు వెలువడనున్నాయి. 13 వేల వరకు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులు భర్తీ చేయనున్నారు.
గెజిటెడ్, ఇంజినీరింగ్ తదితర సర్వీసుల్లో మిగతా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఆయా విభాగాల నుంచి ఖాళీల జాబితా టీజీపీఎస్‌సీకి అందినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 60 వేల ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 17,080 నియామకాల ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. అటు 20,033 కొత్త ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. త్వరలో ఈ పోస్టుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.