నిరుద్యోగులకు శుభవార్త..డిగ్రీ అర్హతతో SBIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( SBI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది
By Knakam Karthik
నిరుద్యోగులకు శుభవార్త..డిగ్రీ అర్హతతో SBIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( SBI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి అప్లికేషన్లను కోరుతోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 6,589 ఖాళీలను (5,180 రెగ్యులర్ ఖాళీలు + 1,409 బ్యాక్‌లాగ్ ఖాళీలు) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భర్తీ చేయనుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, స్థానిక భాష ప్రావీణ్య పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
అర్హత:
కాగా ఈ పోస్టులను అనుసరించి సంబంధింత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో క్వాలిఫై అయి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం, సెమిస్టర్ విద్యార్థులు తాత్కాలికంగా అప్లై చేసుకోవచ్చు. కానీ 31.12.2025 నాటికి లేదా అంతకు ముందు గ్రాడ్యుయేషన్ పరీక్షలో పాసై ఉండాలి. 2025 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసు ఉండాలి. 02-04-1997 నుంచి 01-04-2005 మధ్య అభ్యర్థులు జన్మించిన వారై ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం వంటి అంశాలు తెలిసి ఉండాలి. స్థానిక భాషను చదివినట్లు రుజువు చేసే 10వ, 12వ తరగతి మార్కుల మెమో షీట్‌ను సమర్పించని అభ్యర్థులు తుది నియామకానికి ముందు స్థానిక భాషా పరీక్షలో అర్హత సాధిస్తేనే ఎంపికవుతారు. ఈ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో చేయాలని ఎస్‌బీఐ సూచించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 26 వరకు ఉన్నట్లు తెలిపింది.
పరీక్షా విధానం..
మొదటగా ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. (ఆబ్జెక్టివ్ టెస్ట్ – 100 మార్కులు, సమయం 60 నిమిషాలు). ప్రిలిమినరీలో పాసైతే మెయిన్స్ పరీక్ష ఉంటుంది. (ఆబ్జెక్టివ్ టెస్ట్ – 200 మార్కులకు ఉంటుంది. సమయం 2 గంటలు 40 నిమిషాలు). స్థానిక భాషా పరీక్షను కూడా నిర్వహిస్తారు. ఇక ఫైనల్ సెలక్షన్ మెయిన్స్ పరీక్ష మార్కులు + స్థానిక భాషా పరీక్షలో మార్కుల అర్హత ఆధారంగా ఉంటుంది.