టెకీలు.. రెండో జాబ్ చేశారంటే ఉద్యోగం ఊడినట్లే..!

IBM speaks up on moonlighting after Infosys. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ రెండు మూడు ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు వ్యక్తులు.

By Medi Samrat  Published on  14 Sept 2022 8:00 PM IST
టెకీలు.. రెండో జాబ్ చేశారంటే ఉద్యోగం ఊడినట్లే..!

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ రెండు మూడు ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. వీరిపై సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా రెండేసి ఉద్యోగాలు చేస్తున్నారని సమాచారం అందితే వెంటనే వారిని ఉద్యోగాల నుండి తీసేయాలని ఇప్పటికే హెచ్.ఆర్. లకు సమాచారం కూడా అందింది. ఇప్పటికే పలు ప్రముఖ టెక్ కంపెనీలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. తాజాగా ఐబీఎం కూడా దీనిపై కీలక సూచనలను, హెచ్చరికలను జారీ చేసింది. ప‌ని వేళ‌ల్లో, పని వేళ‌ల అనంత‌రం ఆదాయం ఆర్జించేలా రెండో జాబ్ చేస్తూ ప‌ట్టుబ‌డిన వారిని విధుల నుంచి తొల‌గిస్తామ‌ని కంపెనీలు హెచ్చ‌రిస్తున్నాయి.

ఉద్యోగులు రెండో ఉద్యోగం చేసే (మూన్‌లైటింగ్) వ్య‌వ‌హారంపై ఇన్ఫోసిస్ ఇటీవల త‌మ ఉద్యోగుల‌ను హెచ్చ‌రించ‌గా.. తాజాగా ఐబీఎం కూడా ఆ లిస్టులోకి చేరింది. రెండు ఉద్యోగాల ప‌ద్ధ‌తి నైతికంగా స‌రైంది కాద‌ని ఐబీఎం స్ప‌ష్టం చేసింది. మూన్‌లైటింగ్ లేదా ప‌నిప్ర‌దేశంలో రెండు ఉద్యోగాలు చేప‌ట్టే ఎలాంటి చ‌ర్య‌ల‌నూ స‌హించేది లేద‌ని.. ఉద్యోగులంద‌రూ వారు కంపెనీలోకి ప్ర‌వేశించే ముందు ఐబీఎంకు పూర్తి స‌మ‌యం ప‌నిచేస్తామ‌ని ఒప్పందంపై సంత‌కం చేస్తార‌ని ఐబీఎం స్పష్టం చేసింది. మూన్‌లైటింగ్ ఈ ఒప్పందానికి విరుద్ధ‌మ‌ని, ఇది నైతికంగా స‌రైంది కాద‌ని ఐబీఎం ఇండియా హెడ్, ఎండీ సందీప్ ప‌టేల్ అన్నారు. మూన్‌లైటింగ్‌పై ప‌రిశ్ర‌మ ఇప్ప‌టికే త‌న వైఖ‌రిని వెల్ల‌డించింద‌ని అన్నారు. మూన్‌లైటింగ్‌కు కంపెనీ పూర్తి వ్య‌తిరేక‌మ‌ని ఇన్ఫోసిస్ ఇప్ప‌టికే త‌న ఉద్యోగుల‌కు పంపిన ఈమెయిల్‌లో పేర్కొంది.


Next Story